టెన్నిస్ లో వాళ్ల ముగ్గురిని బీట్ చేసేవాళ్లు లేనే లేరు.. మోడ్రన్ త్రయంపై మాజీ నెంబర్ వన్ ప్రశంసలు
Big 3 In Tennis: వింబూల్డన్ అయినా.. ఫ్రెంచ్ ఓపెన్ అయినా.. ఆస్ట్రేలియన్ ఓపెన్ అయినా.. ఆ ముగ్గురు దిగనంతవరకే. వారిలో ఏ ఒక్కరు ఫీల్డ్ లో ఉన్నా వార్ వన్ సైడ్ అవ్వడమే. సుమారు రెండు దశాబ్దాలుగా టెన్నిస్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న ఆ ముగ్గురు ఆటగాళ్లే రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్, నొవాక్ జకోవిచ్.
ఆధునిక టెన్నిస్ ప్రపంచంలో ఆ ముగ్గురు లివింగ్ లెజెండ్స్. గడిచిన పదిహేనేండ్లుగా వాళ్లు పాల్గొనని టోర్నీ లేదు.. గెలవని కప్పు లేదు. ఒకరిని మించి ఒకరు ఆడుతున్నారు. వింబూల్డన్ అయినా.. ఫ్రెంచ్ ఓపెన్ అయినా.. ఆస్ట్రేలియన్ ఓపెన్ అయినా.. ఆ ముగ్గురు దిగనంతవరకే. వారిలో ఏ ఒక్కరు ఫీల్డ్ లో ఉన్నా వార్ వన్ సైడ్ అవ్వడమే. సుమారు రెండు దశాబ్దాలుగా టెన్నిస్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న ఆ ముగ్గురు ఆటగాళ్లే రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్, నొవాక్ జకోవిచ్. ఈ టెన్నిస్ త్రయంపై మాజీ వరల్డ్ నెంబర్ వన్ జువాన్ కార్లస్ ఫెరీరో తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. బహుశా సమీప భవిష్యత్తులో ఈ ముగ్గురుని బీట్ చేసే వాళ్లు రావడమనేది చాలా కష్టమని అన్నాడు.
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో కార్లొస్ మాట్లాడుతూ.. ‘నాకు తెలిసి టెన్నిస్ లో అలాంటి ముగ్గురు రాకపోవచ్చు. ఆ ముగ్గురు టాప్ టెన్నిస్ ప్లేయర్లుగా సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నారు. వీరి రికార్డులను అధిగమించడం కూడా కష్టమే.. కొత్తగా బిగ్3 అనేది ఇక ఉండకపోవచ్చు..’ అని అన్నాడు.
అయితే ఇప్పుడిప్పుడే టెన్నిస్ లో ఎదుగుతున్న డేనియల్ మెద్వదేవ్, అలగ్జాండర్ జ్వెరెవ్, స్టెఫనోస్ సిట్సిపాస్ లు ఆ ముగ్గురు లెజెండ్స్ ను మరిపించడానికి వీలుందని కార్లోస్ తెలిపాడు. వీళ్లకు తోడు జూనియర్ ప్లేయర్లుగా ఉన్న జన్నిక్ సిన్నర్, సెబాస్టియన్ కొర్డా, కార్లొస అల్కారజ్ కూడా ఇంకా మెరుగుపడితే వారి స్థాయికి చేరుకునే అవకాశం దక్కుతుందని వివరించాడు.
సెర్బియా స్టార్ జకోవిచ్, స్విస్ ఆటగాడు రోజర్ ఫెదరర్, స్పెయిన్ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ లు సుమారు రెండు దశాబ్దాలుగా ఈ క్రీడను శాసిస్తున్నారు. టెన్నిస్ లో బిగ్3 గా గుర్తింపు పొందిన ఈ ముగ్గురు.. గత 11 ఏండ్లలో జరిగిన 43 గ్రాండ్ స్లామ్ లలో 34 గెలుచుకున్నారు. ఈ ఒక్క రికార్డు చాలు టెన్నిస్ లో వాళ్ల ఆధిపత్యం ఏ విధంగా కొనసాగిందో చెప్పడానికి..
ఈ ముగ్గురు ఆటగాళ్లు చిన్న వయసులోనే గ్రాండ్ స్లామ్ లు గెలవడం ప్రారంభించడమే వాళ్ల విజయరహస్యమని కార్లోస్ తెలిపాడు. నాదల్ తన తొలి గ్రాండ్ స్లామ్ ను 19 ఏండ్లలోనే గెలువగా.. ఫెదరరర్ 22 ఏండ్లకు, జకోవిచ్ 20 ఏండ్లకే గ్రాండ్ స్లామ్ నెగ్గిన ఆటగాళ్లుగా గుర్తింపు పొందారు. తాజాగా గాయాల బారిన పడ్డ నాదల్, ఫెదరర్ లు టెన్నిస్ కోర్టుకు దూరంగా ఉంటే.. జకోవిచ్ మాత్రం అదరగొడుతున్నాడు. ఇప్పటికీ 350 వారాలుగా అతడే ప్రపంచ నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు.