ఇండియా-పాక్ మ్యాచ్.. సానియా మీర్జా రియాక్షన్ ఇదే..!
గతంలో భారత్-పాక్‌ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఇరు దేశాల అభిమానులు విపరీతంగా ట్రోల్ చేసిన నేపథ్యంలో సానియా ఈ మేరకు నిర్ణయించుకుని ఉంటుందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ రోజుల్లో క్రికెట్ అంటే ఆసక్తి చూపించనివారు చాలా అరుదు అనే చెప్పాలి. దాదాపు అందరూ టీవీలకు అతుక్కుపోయి మరీ క్రికెట్ మ్యాచ్ లు చూస్తున్నారు. అన్ని మ్యాచులకంటే.. భారత్-పాక్ మధ్య మ్యాచ్ అంటే మరింత క్రేజ్ ఎక్కువ. ఈ రెండు శత్రుదేశాల మధ్య మ్యాచ్ అనగానే.. ఇతర దేశాల వారు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. మనమందరం ఈ మ్యాచ్ ని బాగా ఎంజాయ్ చేస్తాం. కానీ భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మాత్రం ఇబ్బందుల్లో పడుతుంటారు. ఈ మ్యాచ్ లో ఆమె సపోర్టు ఎవరికో తెలుసుకునేందుకు నెటినట్లు అత్యుత్సాహం చూపిస్తుంటారు. ఈ క్రమంలో ఆమెను ట్రోల్ చేయడం చాలా సార్లు జరిగింది. కాగా.. త్వరలో ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ జరగనుండగా.. ముందుగానే సానియా స్పందించడం గమనార్హం.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య ఈ నెల 24న జరగనున్న హై ఓల్టేజ్ పోరు నేపథ్యంలో భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి, పాక్ కోడలు సానియా మీర్జా ఇన్‌స్టా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేసింది. మ్యాచ్ సమయంలో విషపూరిత వాతావరణాన్ని నివారించేందుకే ఆ రోజు సోషల్‌మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. దాయాదులు పోరు జరుగుతున్న సమయంలో ఇరు దేశాల అభిమానులు ఉద్వేగంతో ఉంటారని, అందుకే తాను ఆ రోజు సోషల్‌మీడియా నుంచి మాయమైపోతానని ఇన్‌స్టాలో ఓ వీడియో మెసేజ్ షేర్ చేసింది.
గతంలో భారత్-పాక్‌ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఇరు దేశాల అభిమానులు విపరీతంగా ట్రోల్ చేసిన నేపథ్యంలో సానియా ఈ మేరకు నిర్ణయించుకుని ఉంటుందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా, సానియా భర్త షోయబ్ మాలిక్ పాక్ జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు పాకిస్థాన్ ఇప్పటి వరకు ప్రపంచ కప్ మ్యాచ్‌లలో భారత్‌ను ఓడించింది లేదు. ఈ మెగా టోర్నీలో భారత్-పాక్‌ల మధ్య 5 మ్యాచ్‌లు జరగ్గా.. టీమిండియా 4-0 ఆధిక్యంలో ఉంది. ఓ మ్యాచ్ రద్దైంది.
ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా గ్రూప్-ఏ, గ్రూ-బిలోని క్వాలిఫయర్స్ జట్ల మధ్య తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లు ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ మ్యాచ్‌ల అనంతరం మేజర్ జట్ల మధ్య సూపర్ 12 స్టేజ్ మ్యాచ్‌లు అక్టోబర్ 23 నుంచి ప్రారంభమవుతాయి. ఈ టోర్నీలో టీమిండియా లీగ్ దశలో తలపడబోయే మ్యాచ్‌ల విషయానికొస్తే.. అక్టోబర్ 24న పాక్‌తో, అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న అఫ్గానిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.