Rafael Nadal: రఫేల్ నాదల్ కు కరోనా.. ట్విట్టర్ లో వెల్లడించిన టెన్నిస్ స్టార్.. కీలక టోర్నీకి డౌటే..?
Rafael Nadal Tested Corona Positive: ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు, స్పెయిన్ స్టార్ రఫేల్ నాదల్ కరోనా బారిన పడ్డాడు. దీంతో వచ్చే నెలలో జరిగే కీలక టోర్నీలో అతడు ఆడేది అనుమానంగానే మారింది.
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ కరోనా బారిన పడ్డాడు. గతవారం అబుదాబిలో జరిగిన ఎగ్జిబిషన్ టోర్నీలో ఆడిన నాదల్.. స్వదేశానికి తిరిగిరాగానే కరోనా పరీక్ష్ చేయించుకోగా.. అందులో అతడికి పాజిటివ్ గా తేలింది. దీంతో అతడు హోం క్వారంటైన్ కు పరిమితమయ్యాడు. నాదల్ కు కరోనా సోకిన విషయాన్ని స్వయంగా అతడే ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. తాను కొవిడ్ బారిన పడ్డానని అయితే ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని ట్వీట్ లో వెల్లడించాడు.
ట్విట్టర్ ద్వారా నాదల్ స్పందిస్తూ... ‘అబుదాబి టోర్నీ తర్వాత స్పెయిన్ కు వచ్చాను. ఈ సందర్భంగా నిర్వహించిన పీసీఆర్ టెస్టుల్ో కొవిడ్ సోకినట్టు తేలింది. కొంచెం ఇబ్బందిగా ఉంది. అయితే కంగారు పడాల్సిందేమీ లేదు. నాతో సన్నిహితంగా మెలిగిన వాళ్లకు నాకు కరోనా వచ్చిన విషయం తెలిపాను...’ అని ట్వీట్ చేశాడు.
గత కొద్దికాలంగా పాదానికి గాయం కారణంగా మేజర్ టోర్నీలను కూడా వదులుకున్న ఈ స్పానిష్ స్టార్ ఆటగాడు.. అతి త్వరలోనే తాను పూర్తిగా కోలుకుని తిరిగి టెన్నిస్ కోర్టులో అడుగుపెడతానని చెప్పుకొచ్చాడు. అంతేగాక తన భవిష్యత్ టోర్నీలు, తాను పాల్గొనబోయే పోటీల గురించి త్వరలోనే తెలియజేస్తానని నాదల్ తెలిపాడు.
20 సార్లు గ్రాండ్ స్లామ్ విజేత అయిన నాదల్.. కరోనా కారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ లో పాల్గొనేది అనుమానంగా మారింది. 2022 జనవరి 17 నుంచి ఈ మెగా ఈవెంట్ మొదలుకానున్నది. ఇప్పటికీ కాలిగాయం పూర్తిగా మానకపోవడం.. ఈ క్రమంలోనే నాదల్ కరోనా బారిన పడటంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ లో అతడు పాల్గొంటాడా..? లేదా..? అనేది అనుమానంగా మారింది.