Asianet News TeluguAsianet News Telugu

సెరెనా వీడ్కోలు! ఫెదరర్‌‌దీ అదే బాట.. నాదల్‌కు గాయాలు.. జొకోవిచ్‌కు కరోనా కష్టాలు.. స్వర్ణయుగం ముగిసిందా..?

US OPEN 2022: ఆ నలుగురూ రెండు దశాబ్దాల పాటు ప్రపంచ టెన్నిస్ ను ఏలారు. పురుషుల, మహిళల  టెన్నిస్ లో ఏ టోర్నీ జరిగినా ఆ నలుగురిలో ఎవరికో ఒకరికే ట్రోఫీ దక్కేది. మిగిలినవాళ్లంతా ఏ రెండో స్థానానికో, మూడో స్థానానికో  పోటీ పడాల్సిందే గానీ వారి దరిదాపుల్లోకి కూడా రాలేదు.

Serena Williams Retires, Nadal Injuries, Federer Absence, Djokovic Corona Struggles, IS The Era End in Tennis
Author
First Published Sep 7, 2022, 5:56 PM IST

క్రికెట్‌లో 90, 2000 దశకంలో దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, సనత్ జయసూర్య వంటి ఆటగాళ్లు ఎంత ఫేమసో.. టెన్నిస్‌లో సైతం ఈ శతాబ్దం ప్రారంభం నుంచి నిన్నా మొన్నటివరకు  ఆ నలుగురు  ప్రధాన ప్లేయర్లు అంతకంటే డబుల్ (టెన్నిస్ కు ఉన్న పరిధి దృష్ట్యా) ఫేమస్ . ఆ నలుగురూ రెండు దశాబ్దాల పాటు ప్రపంచ టెన్నిస్ ను ఏలారు. పురుషుల, మహిళల  టెన్నిస్ లో ఏ టోర్నీ జరిగినా ఆ నలుగురిలో ఎవరికో ఒకరికే ట్రోఫీ దక్కేది. మిగిలినవాళ్లంతా ఏ రెండో స్థానానికో, మూడో స్థానానికో  పోటీ పడాల్సిందే గానీ వారి దరిదాపుల్లోకి కూడా రాలేదు.  టెన్నిస్ లో 2000 నుంచి 2020 వరకు టెన్నిస్ ప్రపంచాన్ని ఏలిన  ఆ నలుగురు టెన్నిస్ స్టార్లే రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్,  నొవాక్ జొకోవిచ్,  సెరెనా విలియమ్స్. కానీ ఇప్పుడు వీళ్ల  శకం ముగిసింది. తాజాగా యూఎస్ వేదికగా జరుగుతున్న యూఎస్ ఓపెన్-2022లో ఈ నలుగురిలో ఏ ఒక్కరూ కూడా లేకుండానే క్వార్టర్స్ మ్యాచులు జరుగుతున్నాయి. 

యూఎస్ ఓపెన్ - 2022లో భాగంగా  సెరెనా విలియమ్స్ క్వార్టర్స్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. కెరీర్ లో 24వ గ్రాండ్ స్లామ్ గెలిచి తన సుదీర్ఘ కెరీర్ కు  ఘనమైన ముగింపునివ్వాలని భావించిన ఆమె.. ప్రిక్వార్టర్స్ కు ముందు మ్యాచ్ లోనే ఓడి టెన్నిస్ కు వీడ్కోలు చెప్పింది. 

ఇక మంగళవారం ఉదయం జరిగిన  ప్రిక్వార్టర్స్ మ్యాచ్ లో రఫెల్ నాదల్..  అమెరికాకు చెందిన ఫ్రాన్సెస్ టియోఫో చేతిలో ఓడాడు. ఈ ఏడాది వరుసగా రెండు గ్రాండ్ స్లామ్ (ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్) గెలిచిన నాదల్..  యూఎస్ ఓపెన్ కూడా గెలిచి సెరీనా (23 గ్రాండ్ స్లామ్ లు ) తో సమానంగా నిలుద్దామని భావించాడు. కానీ అతడికి నిరాశే ఎదురైంది. యూఎస్ ఓపెన్ ముగిశాక అతడు ఆటకు విరామం తీసుకుంటానని చెప్పాడు. అదీగాక నాదల్ భార్య ఇప్పుడు గర్భవతి. ఇవన్నీ ముగిసి  నాదల్ మళ్లీ టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టడం కష్టమే..

వీళ్లిద్దరి కథ ఇలా ఉంటే ఫెదరర్, జొకోవిచ్ ల కథ మరోలా ఉంది. 2021 జూన్ లో   వింబూల్డన్ లో కనిపించాడంటే స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ మళ్లీ టెన్నిస్ కోర్టులో కనిపించలేదు. ఆ తర్వాత కుడికాలికి గాయం కారణంగా ఫెదరర్ ఇంటికే పరిమితమవుతున్నాడు. అయితే 2023 ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ లో ఆడతానని ఫెదరర్ ఇదివరకే ప్రకటించాడు. కానీ ఇప్పటికే 41 ఏండ్లు ఉన్న ఫెదరర్ తిరిగి టెన్నిస్  రాకెట్ పట్టుకోగలడా..? పట్టుకున్నా మునపటి ఆట ఆడగలడా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.  

ఇక వీరందరిలో జొకోవిచ్ కు ఇంకా టెన్నిస్ ఆడే వయసు, ఆసక్తి ఎక్కువగా ఉన్నా అతడి మొండి పట్టుదల వల్ల  జొకోవిచ్ కీలక టోర్నీలకు దూరమవుతున్నాడు.  కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి నిరాకరిస్తున్న జొకోవిచ్.. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ తో పాటు యూఎస్ ఓపెన్ నుంచీ తప్పుకోవాల్సి వచ్చింది.  మరి రాబోయే రోజుల్లో జొకోవిచ్ వ్యాక్సిన్ వేసుకుంటాడా..? వేసుకున్నా పాత జొకోవిచ్ ను చూస్తామా..? అనేది అనుమానమే. 

రికార్డులకే రికార్డులు.. 

ఆధునిక టెన్నిస్ లో ఈ నలుగురి పేరు మీద వందలాది రికార్డులున్నాయి. ఫెదరర్ (20), జొకోవిచ్ (21), నాదల్ (22), సెరెనా (23) కలిసి  మొత్తంగా  86 గ్రాండ్ స్లామ్‌లను కలిగి ఉన్నారు.  పురుషుల సింగిల్స్ లో అత్యధిక  గ్రాండ్ స్లామ్ లు కలిగి ఉన్న  ఆటగాడిగా నాదల్ ఉండగా.. మహిళల సింగిల్స్ లో సెరెనా రెండో స్థానంలో ఉంది.  

 

యూఎస్ ఓపెన్ లో చాలా రోజుల తర్వాత.. 

యూఎస్ ఓపెన్ లో పైన పేర్కొన్న నలుగురు దిగ్గజాలు చాలాకాలం పాటు  ట్రోఫీలను మార్చుకున్నారు. పురుషుల సింగిల్స్ లో ఫెదరర్, జొకోవిచ్, నాదల్ లను దాటి మరో ఆటగాడు ట్రోఫీని ఎగురేసుకపోయిన సందర్భాలు వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అలాంటిది ప్రస్తుతం  బుధవారం నుంచి ప్రారంభమైన క్వార్టర్ ఫైనల్స్ లో ఈ నలుగురిలో ఏ ఒక్కరూ ఆడటం లేదు. 15 మంది క్వార్టర్స్ చేరగా అందులో ఒక ఇగా స్వియాటెక్ (పోలాండ్- రెండు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్, ఒక ఆస్ట్రేలియా ఓపెన్) మినహా మిగిలినవారెవరూ కనీసం  మేజర్ టోర్నీలో సెమీస్ కు కూడా చేరలేదు.  1968 తర్వాత యూఎస్ ఓపెన్ లో ఇలా.. రెండు మేజర్ గ్రాండ్ స్లామ్ లు గెలిచినవారైనా లేకుండా క్వార్టర్స్ జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అదీగాక పురుషుల టెన్నిస్ లో  భాగంగా యూఎస్ ఓపెన్ లో క్వార్టర్స్ కు చేరిన వారిలో  ఆండ్రీ రుబ్లెవ్ మాత్రమే వచ్చే నెలలో 25 ఏండ్లకు చేరువవుతున్నాడు. మిగిలినవారంతా 24 ఏండ్ల కంటే తక్కువ వారే.  

కొత్త నీరు వస్తోంది.. 

టెన్నిస్ లో స్వర్ణయుగంగా భావించే ఈ నలుగురు  దాదాపు ఆటకు దూరమైనట్టే. ఆడినా అరకొర మ్యాచ్ లలో తప్పితే  పూర్తిస్థాయిలో అయితే కాదు. అయితే పాత తరం పోయినప్పుడల్లా కొత్త తరం  ఉరకలెత్తిన ఉత్సాహంతో రావాల్సిందే.  పై నలుగురి స్థానంలో కొత్త ఛాంపియన్లు రెడీ అవుతున్నారు.  ఈ నలుగురి  స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లు ఎవరైనా ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఛాంపియన్ గా మారాలంటే కొంత సమయం పట్టొచ్చు. ఇదే విషయమై  28 ఏండ్ల కరోలినా గ్రాషియా (యూఎస్ ఓపెన్ లో క్వార్టర్స్ కు చేరింది) స్పందిస్తూ.. ‘గొప్ప విజేతలు వెళ్తారు. కొత్త విజేతలు వస్తారు. అయితే కొత్త ఆటగాళ్లకు కుదరుకునేందుకు సమయమివ్వాలి. వయసు, అనుభవం బట్టి వాళ్లు మెల్లిగా రాటుదేలుతారు. అయితే ఎంతమంది వచ్చినా ఆదరించడానికి టెన్నిస్ అభిమానులు సిద్ధంగానే ఉన్నారు. ఈ ఆట ఎప్పటికీ నిలిచే ఉంటుంది..’ అని తెలిపింది. 

 

క్రికెట్ లో సచిన్ రిటైరైతే కోహ్లీ రాలేదా..? లారా లేకుంటే  పాంటింగ్ ఆడలేదా..? ఇంజమామ్ రిటైరైతే బాబర్ చెలరేగడం లేదా..? టెన్నిస్ లోనూ అంతే. ఇప్పటికే  డెనియల్ మెద్వదేవ్, అలగ్జాండర్ జ్వెరెవ్, కార్లోస్ అల్కరజ్, స్టెఫానోస్ సిట్సిపాస్ వంటి ఆటగాళ్లు ఇప్పటికే తామేంటో నిరూపించుకున్నారు. మహిళల విభాగంలో  ఇగా స్వియాటెక్, ఎమ్మా రడుకాను, కోకో గాఫ్ వంటి తారలూ వచ్చారు. వీళ్లు  ఇక  ఫ్యాబ్-4 సరసన చేరడమే తరువాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios