Asianet News TeluguAsianet News Telugu

ఇక్కడే మొదలెట్టా.. ఇప్పుడు నా కొడుకు ముందు ఇలా : సానియా మీర్జా భావోద్వేగ వ్యాఖ్యలు

Australia Open 2023: భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా  మీర్జా తన గ్రాండ్ స్లామ్ పోరాటాన్ని ముగించింది.  మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ లో ఆమె తన చివరి మ్యాచ్ ను ఆడేసింది. 

Sania Mirza In Tears After she Ends Her Grand slam Career, Says This MSV
Author
First Published Jan 27, 2023, 4:13 PM IST

భారత టెన్నిస్ లో సంచలనంగా దూసుకొచ్చి దేశంలో ఆటను మరోస్థాయికి తీసుకెళ్లిన హైదరాబాదీ టెన్నిస్ స్టార్  సానియా మీర్జా తన గ్రాండ్ స్లామ్ ప్రయాణాన్ని  ఓటమితో ముగించింది.   మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న  ఆస్ట్రేలియా ఓపెన్ - 2023లో   ఆమె తన చివరి మ్యాచ్ ను ఆడింది. భారత ఆటగాడు రోహన్ బోపన్నతో కలిసి  గురువారం  ముగిసిన  ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ ఫైనల్స్  ఆడిన సానియా..  బ్రెజిల్ జంట  స్టెఫాని - రఫెల్ చేతిలో ఓడింది. ఓటమి అనంతరం ఆమె  భావోద్వేగంగా మాట్లాడింది. 

సానియా మాట్లాడుతూ...‘నా ప్రొఫెషనల్ కెరీర్ మెల్‌బోర్న్ లోనే మొదలైంది.  2005లో నేను 18 ఏండ్ల  వయసున్నప్పుడు ఇక్కడ తొలి మ్యాచ్ ఆడాను. యాధృశ్చికంగా నా  గ్రాండ్ స్లామ్ కెరీర్ చివరి మ్యాచ్ కూడా ఇక్కడే ఆడాను.  18 ఏండ్లప్పుడు  సెరెనా విలియమ్స్ తో థర్డ్ రౌండ్ ఆడాను. 

నా కుమారుడి సమక్షంలో  ఇలా ఇంతమంది ముందు గ్రాండ్ స్లామ్ ఫైనల్ ఆడతానని అస్సలు ఊహించలేదు.  నేనెప్పుడు ఇక్కడ ఆడిన సొంత దేశంలో ఆడినట్టే అనిపించేది...’అని  ముగించింది. మాట్లాడుతుండగా ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. భావోద్వేగంతో మాట్లాడిన సానియా..  కాసేపు ఆగి మళ్లీ తన  ప్రసంగాన్ని కొనసాగించింది. ఈ వీడియోను ఆస్ట్రేలియా ఓపెన్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘వి లవ్ యూ సానియా’అని  ఆమెకు వీడ్కోలు పలికింది.  

36 ఏండ్ల సోనియా..  కొద్దిరోజుల క్రితమే ఆస్ట్రేలియా ఓపెనే తన చివరి గ్రాండ్ స్లామ్ అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఫైనల్లో ఆమెకు  నిరాశఎదురైనా  రన్నరప్ తోనే సరిపెట్టుకుంది.  ఈ టోర్నీలో సానియా మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ లో  పోటీ పడింది. మహిళల డబుల్స్ లో నిరాశపరిచినా మిక్స్‌డ్ డబుల్స్ లో మాత్రం   ఫైనల్ కు  చేరింది.   వచ్చే నెలలో దుబాయ్ లో జరుగబోయే   దుబాయ్ ఓపెన్ లో  సానియా మీర్జా తన చివరి  టోర్నీ ఆడనుంది. ఈ టోర్నీ తర్వాత ఆమె ఆట నుంచి అధికారికంగా వైదొలగనుంది. 

 

2005 నుంచి టెన్నిస్ ఆడుతున్న ఈ హైదరాబాదీ స్టార్.. ఇప్పటివరకు కెరీర్ లో 43 టైటిల్స్ నెగ్గింది.  ఇందులో ఆరు గ్రాండ్ స్లామ్ ట్రోఫీలు ఉన్నాయి. మహిళల డబుల్స్ కేటగిరీలో  91 వారాల పాటు  ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణిగా కొనసాగడం విశేషం.  

 

Follow Us:
Download App:
  • android
  • ios