French Open: ఇదే ఆట గొప్పతనం.. నాదల్ పై ప్రశంసలు కురిపించిన సచిన్, రవిశాస్త్రి
French Open 2022: ఫ్రెంచ్ ఓపెన్ లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి సెమీస్ లో మట్టి కోర్టు మహారాజు రఫెల్ నాదల్.. జర్మనీకి చెందిన మూడో సీడ్ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ పై నెగ్గాడు.
ఫ్రెంచ్ ఓపెన్ - 2022 లో భాగంగా శుక్రవారం రఫెల్ నాదల్ (స్పెయిన్), అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) మధ్య జరిగిన పురుషుల తొలి సెమీఫైనల్లో నాదల్ అతి కష్మమ్మీద విజయం సాధించాడు. హోరాహోరిగా సాగుతున్న పోరులో రెండో సెట్ చివర్లో అనూహ్యంగా గాయంతో కిందపడిపోయాడ జ్వెరెవ్. గాయం తీవ్రత ఎక్కువవడంతో అతడిని వీల్ చైర్ లో తరలించారు. కొద్దిసేపటికి అతడు తిరిగి టెన్నిస్ కోర్టులోకి వచ్చి ప్రేక్షకులకు అభివాదం చేసి చేతి కర్రల సాయంతో నిరాశగా వెనుదిరిగాడు. ఆ సమయంలో నాదల్.. జ్వెరెవ్ వెంటే ఉన్నాడు.
చేతి కర్రల సాయంతో జ్వెరెవ్ నడుస్తుండగా.. నాదల్ అతడి టీషర్ట్ పట్టుకుని జ్వెరెవ్ తో పాటే నడిచాడు. టెన్నిస్ కోర్టు నుంచి డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లేవరకు నాదల్.. జ్వెరెవ్ కు సాయంగానే ఉన్నాడు.
నాదల్ చేసిన ఈ పని ప్రపంచ టెన్నిస్ ప్రేమికులతో పాటు క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రిలను కూడా ఆకర్షించింది. ఇదే విషయమై సచిన్ టెండూల్కర్ తన ట్విటర్ లో స్పందించాడు. జ్వెరెవ్ పక్కన నడుస్తున్న నాదల్ ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘జ్వెరెవ్ మీద నాదల్ చూపిన శ్రద్ధ, మానవత్వం అతడిని మరింత ప్రత్యేకమైన ఆటగాడిగా నిలబెట్టాయి..’ అని రాసుకొచ్చాడు.
ఇక టీమిండియా మాజీ సారథి, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇదే ఫోటోను షేర్ చేస్తూ.. ‘ఇదే ఆట గొప్పతనం. ఇది మిమ్మల్ని కన్నీళ్లు పెట్టిస్తుంది. జ్వెరెవ్ నువ్వు త్వరలోనే కోలుకుంటావ్. నాదల్.. ఇవాళ నువ్వు చూపిన క్రీడా స్పూర్తి ఎంతో గొప్పది, గౌరవనీయమైనది..’ అని ట్వీట్ చేశాడు.
కాగా.. తన పుట్టినరోజున జరిగిన తొలి సెమీస్ లో నాదల్ కష్టించి ఫైనల్ చేరాడు. జ్వెరెవ్ తో జరిగిన పోరులో నాదల్ 7-6, (10/8) తో టై బ్రేకర్ ద్వారా ఫైనల్ కు చేరాడు. ఆదివారం జరిగే పురుషుల ఫైనల్ లో నాదల్.. క్యాస్పర్ రూడ్ (క్రొయేషియా) తో తలపడతాడు. ఫ్రెంచ్ ఓపెన్ లో ఫైనల్ ఆడటం నాదల్ కు ఇది 14వ సారి. ఇందులో 13 సార్లు నాదల్ విజేత గా నిలిచాడు.