హే తూచ్..! మాది రష్యా కాదు.. నేను వింబూల్డన్ ఆడతా..!! పుతిన్ పాపానికి బలౌతున్న రష్యా టెన్నిస్ క్రీడాకారులు
Wimbledon 2022: మూడు నెలలుగా ఉక్రెయిన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేస్తున్న పనులు ఆ దేశ ఆటగాళ్ల కెరీర్ ల మీద తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి.
ఈనెల 27 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వింబూల్డన్-2022 ప్రారంభం కావాల్సి ఉన్నది. అయితే ఈ టోర్నీలో పాల్గొనడానికి రష్యాకు చెందిన ఓ టెన్నిస్ క్రీడాకారిణి ఏకంగా తన జాతీయతను మార్చుకోనుంది. తాను రష్యన్ ను కాదని.. జార్జియా తరఫున ఆడతానని వింబూల్డన్ నిర్వాహకులకు మొరపెట్టుకోనుంది. ఆ క్రీడాకారిణి పేరు నటెల జల్మైడ్జ్ (Natela Dzalamidze). రష్యాకు చెందిన ఈమె.. వింబూల్డన్ లో ఎలాగైనా ఆడాలనే పట్టుదలతో తన సొంత దేశం పౌరసత్వం వదులకోవడానికి సిద్ధమైంది.
29 ఏండ్ల ఈ డబుల్స్ క్రీడాకారిణి.. అలగ్జాండ్ర క్రునిక్ (సెర్బియా) తో కలిసి టెన్నిస్ డబుల్స్ ఆడుతున్నది. 44వ ర్యాంకర్ అయిన నటెల.. రష్యా జెండా మీద వింబూల్డన్ లో పాల్గొనడం సాధ్యం కాకనే.. జార్జియా తరఫున ఆడేందుకు సిద్ధమైందని సమాచారం.
వింబూల్డన్ లో రష్యా ఆటగాళ్లెవరూ పాల్గొనడానికి వీళ్లేదని.. వాళ్లు రష్యా జెండా మీద పాల్గొంటే టోర్నీలోని అనుమించబోమని ఆల్ ఇంగ్లాండ్ ఈ ఏడాది ఏప్రిల్ లో వెల్లడించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం నేపథ్యంలో వింబూల్డన్ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మూడు నెలలుగా ఉక్రెయిన్ పై బాంబులతో విరుచుకుపడుతున్న రష్యా.. ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నవిధంగా వ్యవహరిస్తున్నది. పుతిన్ రాజకీయ లక్ష్యాలు ఎలా ఉన్నా అవి ఆ దేశ క్రీడాకారుల కెరీర్ మీద తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం, తైక్వాండో, ఫిఫా, ఎఫ్1 రేస్ వంటి ప్రఖ్యాత క్రీడా సంఘాలు రష్యాతో పాటు ఆ దేశానికి వంతపాడుతున్న బెలారస్ పై కూడా నిషేధం విధించిన విషయం తెలిసిందే.
ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ కూడా రష్యాతో బెలారస్ టెన్నిస్ క్రీడాకారులపై నిషేధం విధించింది. అయితే తాజాగా నటెల తన జాతీయతను మార్చుకోవడంతో ఆమెను వింబూల్డన్ లో ఆడిస్తారా..? అన్న ప్రశ్నకు ఆల్ ఇంగ్లాండ్ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘అది మహిళా టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యూటీఏ), అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) చూసుకుంటుంది..’అని తెలిపాడు. వాళ్లు సమ్మతిస్తే వింబూల్డన్ లో నటెలను ఆడించడానికి తమకేమీ ఇబ్బంది లేదని చెప్పాడు. కాగా పురుషుల టెన్నిస్ లో ప్రపంచ అగ్రశ్రేణి ఆటగాడిగా ఉన్న మెద్వదేవ్ (రష్యా) ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.