Roger Federer: పోరాడతారనుకుంటే పొత్తు కూడుతున్నారు.. నాదల్‌తో కలిసి చివరి మ్యాచ్ ఆడనున్న ఫెదరర్
Roger Federer - Rafael Nadal: సుదీర్ఘ టెన్నిస్ కెరీర్‌కు ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్.. తన చివరి మ్యాచ్ లో తన స్నేహితుడు రఫెల్ నాదల్ తో కలిసి ఆడనున్నాడు.
గడిచిన రెండు దశాబ్దాలలో టెన్నిస్ ప్రపంచం చూసిన గొప్ప మ్యాచ్‌లలో టాప్‌లో ఉండే ఓ పదింటిని ఎంపిక చేస్తే అందులో రోజర్ ఫెదరర్-రఫెల్ నాదల్‌లు ఆడిన మ్యాచ్‌లే నాలుగైదు ఉంటాయి. టెన్నిస్ కోర్టులో కొదమసింహాల్లా కొట్లాడే ఈ ఇద్దరి మధ్య మ్యాచ్ అంటే చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. అయితే ఇటీవలే టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్.. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తో ఒక్క మ్యాచ్ అయినా ఆడి తన కెరీర్ ను ముగించాలని టెన్నిస్ అభిమానులు అంతా కోరుకున్నారు. కానీ వాళ్ల ఆశ సగమే నెరవేరింది. ఈ ఇద్దరూ ఒక మ్యాచ్ లో ఆడుతున్నారు. కానీ ప్రత్యర్థులుగా కాదు.. కలిసికట్టుగా..!!
లండన్ వేదికగా రేపటి (సెప్టెంబర్ 23) నుంచి ప్రారంభం కాబోతున్న లేవర్ కప్ లో ఫెదరర్, నాదల్ యూరప్ తరఫున ఆడుతున్నారు. ఫెదరర్-నాదల్ లు కలిసి రేపు డబుల్స్ మ్యాచ్ ఆడనున్నారు. డబుల్స్ లో ఈ ఇద్దరూ యూఎస్ కు చెందిన ఫ్రాన్సెస్ టియోఫో-జాక్ సాక్ లతో తలపడనున్నారు.
ఇటీవలే ముగిసిన యూఎస్ ఓపెన్ లో నాదల్.. టియోఫో చేతిలోనే ఓడిన విషయం తెలిసిందే. ప్రి క్వార్టర్స్ లో టియోఫో.. నాదల్ పై గెలుపొంది సెమీస్ వరకు చేరుకోగలిగాడు.
ఇక ఫెదరర్.. గతేడాది వింబూల్డన్ క్వార్టర్స్ లో హుబర్ట్ హుక్రాజ్ చేతిలో ఓడిపోయాక తిరిగి రాకెట్ పట్టలేదు. మోకాలి నొప్పి గాయంతో అతడు ఏడాదికాలంగా విరామం తీసుకున్నాడు. మరి రేపటి తన చివరి మ్యాచ్ లో ఫెదరర్ ఎలా ఆడతాడు..? నాదల్-ఫెదరర్ మధ్య సమన్వయం ఎలా ఉంటుంది..? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇక ఈ మ్యాచ్ గురించి ఫెదరర్ స్పందిస్తూ.. ‘రేపటి మ్యాచ్ లో ఎలా ఆడతాను..? అనేది ఇప్పుడే చెప్పలేను. కానీ నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. నాదల్ తో కలిసి ఆడుతుండటం భిన్నంగా అనిపిస్తున్నది. అతడు నా ప్రత్యర్థిగా కాకుండా నాతో కలిసి ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది..’ అని చెప్పాడు.
నాదల్ స్పందిస్తూ.. ‘నా టెన్నిస్ కెరీర్ లో అత్యంత ముఖ్యమైన మ్యాచ్ ఇది. ఫెదరర్ తో కలిసి ఆడటం చాలా ఆనందంగా ఉంది. కానీ టెన్నిస్ రారాజుగా ఉన్న ఫెదరర్ ఈ మ్యాచ్ తర్వాత నిష్క్రమిస్తున్నారనే విషయం కాస్త బాధగా ఉంది. ఈ క్షణం కష్టంగా ఉన్నా ఫెదరర్ తో ఆడేందకు చాలా ఉత్సాహంగా ఉన్నాను..’ అని చెప్పాడు.
లేవర్ కప్ లో భాగంగా యూరప్ జట్టుకు బోర్న్ బోర్గ్ సారథ్యం వహిస్తున్నారు. ఈ జట్టులో ఫెదరర్, నాదల్ తో పాటు జొకోవిచ్ కూడా ఉన్నాడు. అంతేగాక ఆండీ ముర్రే కూడా ఇదే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
యూఎస్ తరఫున జాన్ మెక్ ఎనోర్ సారథిగా ఉండగా టేలర్ ఫ్రిట్జ్, ఫెలిక్స్ అగర్ అలియస్సీమ్, డీగ్ స్వార్ట్జమన్, ఫ్రాన్సిస్ టియోఫో, జాక్ సాక్ వంటి ఆటగాళ్లు ఉన్నారు.