Roger Federer: మిగతా మూడు టైటిల్‌లు నెగ్గినా అక్కడ మాత్రం పెదరర్‌కు నిరాశే..
Roger Federer Retires: ప్రపంచ టెన్నిస్ లో ఓ సువర్ణాధ్యాయం ముగిసింది. పురుషుల టెన్నిస్ రారాజు స్విస్ మ్యాస్ట్రో రోజర్ ఫెదరర్ తన 24 ఏండ్ల కెరీర్ కు గురువారం వీడ్కోలు పలికాడు.
ప్రపంచ టెన్నిస్ ను సుమారు రెండు దశాబ్దాల పాటు తన ఆటతో అలరించిన స్విట్జర్లాండ్ వీరుడు రోజర్ ఫెదరర్ టెన్నిస్ కోర్టులో తన పోరాటానికి వీడ్కోలు పలికాడు. గురువారం సాయంత్రం సోషల్ మీడియా వేదికగా ఫెదరర్.. టెన్నిస్ కు రిటైర్మెంట్ చెబుతున్నట్టు ప్రకటించాడు. 24 ఏండ్ల సుదీర్ఘ కెరీర్ లో 1500కు పైగా మ్యాచ్ లు ఆడిన ఈ స్విస్ మ్యాస్ట్రో.. 20 గ్రాండ్ స్లామ్ లను సాధించాడు. అయితే మిగతా మూడు టోర్నీలు (ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబూల్డన్ ఓపెన్, యూఎస్ ఓపెన్) గెలిచినా ఫ్రెంచ్ ఓపెన్ లో మాత్రం నిరాశే ఎదురైంది. కెరీర్ లో ఎక్కడికెళ్లినా విజయాలు సాధించినా ఫెదరర్.. ఫ్రెంచ్ ఓపెన్ లో మాత్రం ఒక్కసారే గెలిచాడు.
సుదీర్ఘ కెరీర్ లో 20 గ్రాండ్ స్లామ్ లు నెగ్గిన ఫెదరర్.. ఆస్ట్రేలియా ఓపెన్ ను 6 సార్లు నెగ్గగా వింబూల్డన్ లో 8 సార్లు టైటిల్ గెలిచాడు. ఐదు సార్లు యూఎస్ ఓపెన్ లో విజయం సాధించాడు. కానీ కెరీర్ మొత్తంలో ఫ్రెంచ్ ఓపెన్ ను ఒక్కసారే గెలిచాడు.
మిగతా మూడు టోర్నీలలో ఫెదరర్ నెగ్గుకొచ్చినా ఫ్రెంచ్ ఓపెన్ లో రాణించకపోవడానికి కారణం ఒక్కటే.. అక్కడున్నది ఎవరో కాదు. స్పెయిన్ బుల్, ఫెదరర్ ఇష్టమైన స్నేహితుడు, అంతకన్నా ఇష్టమైన ప్రత్యర్థి రఫెల్ నాదల్. ఈ ఇద్దరూ కలిసి ఎర్రమట్టి కోర్టు (ఫ్రెంచ్ ఓపెన్) లో 2005 (సెమీస్), 2006 (ఫైనల్), 2007 (ఫైనల్స్), 2008 (ఫైనల్స్) 2011 (ఫైనల్స్), 2019 (సెమీస్) లలో(ఆరుసార్లు) తలపడ్డారు. ఆరు మ్యాచ్ లలో 22 సెట్లు జరుగగా అందులో 18 సెట్లు నాదల్ వే కావడం గమనార్హం. ఒక్క మ్యాచ్ లో కూడా నాదల్ ఓడలేదు.
ఫెదరర్ ఫ్రెంచ్ ఓపెన్ గెలిచింది 2009 లో. అతడి కెరీర్ లో మట్టి కోర్టుపై టైటిల్ ను ముద్దాడింది ఈ ఒక్కసారే. అయితే ఆ ఏడాది రఫా.. క్వార్టర్ ఫైనల్ లో సోదర్లింగ్ చేతొలో అనూహ్య ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోని ఫెదరర్.. ఫైనల్లో అదే సోదర్లింగ్ ను మట్టి కరిపించి ఎర్రమట్టి కోర్టు విజేతగా నిలిచాడు. దీంతో అతడు నాలుగు టోర్నీలు గెలిచిన ఆటగాళ్ల జాబితాలో ఆల్ టైం గ్రేట్ గా నిలిచాడు. 2009 లో గనక రఫా ఓడిపోయి ఉండకుంటే.. ఫైనల్ లో మళ్లీ మిగతా ఫలితాలే రిపీట్ అయ్యేవి కాబోలు.. అలా జరిగి ఉంటే ఫెదరర్ కు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ లేని లోటు అలాగే ఉండేది.
ఫెదరర్ కెరీర్ గ్రాఫ్ ను ఓసారి పరిశీలిస్తే..
- కెరీర్ లో మొత్తం ఆడిన మ్యాచ్ లు : 1,526
- విజయాలు : 1,251
- గెలిచిన టైటిల్స్ : 103
- గ్రాండ్ స్లామ్స్ : 20 (జొకోవిచ్ 21, నాదల్ 22 ముందున్నారు)
- గ్రాండ్ స్లామ్స్ లో విజయాల సంఖ్య : 369 (జొకోవిచ్ 334, నాదల్ 313.. ఫెదరర్ కంటే వెనుకే ఉన్నారు)
- ఏటీపీ ర్యాంకింగ్స్ లో 237 వారాల పాటు నెంబర్ వన్ గా ఉన్నాడు.
- ఒక ఏడాది (2006, 2007, 2009) లో నాలుగు గ్రాండ్ స్లామ్స్ ఫైనల్స్ కు చేరిన తొలి ఆటగాడు.
- ఒలింపిక్ పతకాలు - 2 (2008 బీజింగ్ ఒలింపిక్స్ లో డబుల్స్ లో స్వర్ణం, 2012 లండన్ ఒలింపిక్స్ లో కాంస్యం)
- 24 ఏండ్ల కెరీర్ లో 1526 సింగిల్స్, 223 డబుల్స్ మ్యాచ్ లు ఆడిన ఫెదరర్.. ఒక్క మ్యాచ్ లో కూడా అలసట, గాయం కారణాలు చెప్పి టెన్నిస్ కోర్టు నుంచి వెళ్లిపోలేదు.