Roger Federer - Rafael Nadal: క్రికెట్ లో  ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లకు ఎంత క్రేజ్ ఉందో టెన్నిస్ లో అంతకుమించి  ఏమాత్రం తగ్గని క్రేజ్  రఫెల్ నాదల్-రోజర్ ఫెదరర్  పోరుకు ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు.   

ప్రపంచ టెన్నిస్ కు వీడ్కోలు చెబుతూ ఫెదరర్ తీసుకున్న  నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా క్రీడా దిగ్గజాలు స్పందిస్తున్నారు. టెన్నిస్ నుంచే గాక క్రికెట్, ఇతర క్రీడలకు చెందిన క్రీడాకారులు ఫెదరర్ తో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు. అయితే  ఎంతమంది ఎలా స్పందించినా  ఫెదరర్ రిటైర్మెంట్ నిర్ణయంపై తనకు ఎంతో ఇష్టమైన స్నేహితుడు,  అంతకంటే ఇష్టమైన ప్రత్యర్థి రఫెల్ నాదల్ ఎలా స్పందిస్తాడని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు.  ఈ ఇద్దరి మధ్య స్నేహం ఇవ్వాల్టిది కాదు. గత  రెండు దశాబ్దాలుగా కలిసి ఆడుతున్న ఈ ఇద్దరూ తలపడితే రెండు కొదమసింహాలు తలపడినట్టే ఉండేది.  క్రికెట్ లో భారత్-పాకిస్తాన్, ఇంగ్లాండ్ -ఆస్ట్రేలియా మ్యాచ్ లకు ఎంత క్రేజ్ ఉందో..టెన్నిస్ లో కూడా నాదల్-రోజర్ తలపడుతున్నారంటే అంతకంటే ఎక్కువ క్రేజ్ ఉండేది. 

ఇద్దరూ కలిసి  48 సార్లు తలపడితే అందులో నాదల్ దే పైచేయి. నాదల్  24 సార్లు, ఫెదరర్  16 సార్లు  గెలిచారు.  ఇక గ్రాండ్ స్లామ్ టోర్నీలలో ఇద్దరూ  14 సార్లు హోరాహోరి పోరాడారు. ఇందులో నాదల్ 10 సార్లు గెలిస్తే.. ఫెదరర్  4 సార్లు మాత్రమే విజయం సాధించాడు.  

ఒకరకంగా చెప్పాలంటే ఫెదరర్ తన కెరీర్ లో మరిన్ని గ్రాండ్ స్లామ్ లు గెలిచేవాడే. కానీ యూఎస్ ఓపెన్, వింబూల్డన్, ఆస్ట్రేలియా ఓపెన్ లో  అలవోకగా టోర్నీలు నెగ్గిన ఫెదరర్..  ఫ్రెంచ్ ఓపెన్ లో మాత్రం  ఆ స్థాయి విజయాలు అందుకున్నాడు. అందుకు కారణం రఫానే. ఈ ఇద్దరూ ఫ్రెంచ్ ఓపెన్ లో ఆరుసార్లు తలపడితే ఆరింటిలోనూ నాదల్  నే విజయం వరించింది. 

 

Scroll to load tweet…

ఇక  ఫెదరర్ రిటైర్మెంట్ పై నాదల్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ..  ‘నాకెంతో ఇష్టమైన స్నేహితుడు,  ప్రియమైన ప్రత్యర్థి  ఫెదరర్.. ఇలాంటి ఒకరోజు రావొద్దని కోరుకున్నా. వ్యక్తిగతంగా నాకు, టెన్నిస్ ప్రపంచానికి ఇది విచారకరమైన రోజ. అయితే ఇన్నాళ్లు నీతో కలిసి ఆడినందుకు గర్వంగా, గౌరవంగా ఉంది.  టెన్నిస్ కోర్టు లోపల, బయిట నీతో ఎన్నో మధురక్షణాలున్నాయి.  వాటన్నింటినీ ఆస్వాదించా.  రాబోయేకాలంలోనూ  నీతో మరెన్నో క్షణాలను పంచుకుంటా.  మనిద్దరం కలిసి చేయాల్సిన పనులెన్నో ఉన్నాయని మనకు తెలుసు.  ప్రొఫెషనల్ టెన్నిస్ కు గుడ్ బై చెప్పిన నువ్వు.. నీ కుటుంబంతో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నా. లండన్ లో నిన్ను కలుస్తా...’ అని ట్వీట్ చేశాడు 

ఎర్రమట్టి కోర్టు (ఫ్రెంచ్ ఓపెన్) లో ఈ ఇద్దరూ కలిసి  2005 (సెమీస్), 2006 (ఫైనల్), 2007 (ఫైనల్స్), 2008 (ఫైనల్స్) 2011 (ఫైనల్స్), 2019 (సెమీస్) లలో(ఆరుసార్లు) తలపడ్డారు.  ఆరు మ్యాచ్ లలో  22 సెట్లు జరుగగా  అందులో 18 సెట్లు నాదల్ వే కావడం గమనార్హం.  ఏ ఒక్క మ్యాచ్ లో కూడా నాదల్ ఓడలేదు. ఫెదరర్ ఫ్రెంచ్ ఓపెన్ గెలిచింది  2009 లో. అతడి కెరీర్ లో మట్టి కోర్టుపై టైటిల్ ను ముద్దాడింది ఈ ఒక్కసారే. అయితే ఆ ఏడాది రఫా..  క్వార్టర్ ఫైనల్ లో సోదర్లింగ్ చేతొలో అనూహ్య ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు.  ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోని ఫెదరర్..  ఫైనల్లో అదే సోదర్లింగ్ ను మట్టి కరిపించి టైటిల్ విజేతగా నిలిచాడు.