Rafael Nadal: స్టెఫీ గ్రాఫ్ ను సమం చేసిన నాదల్.. ఇక మిగిలింది ఆ ఇద్దరే.. మరో రెండు అడుగుల దూరంలో..
French Open 2022: స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్-2022 లో నెగ్గి వయసు మీద పడుతున్నా తనలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో అతడు టెన్నిస్ దిగ్గజం స్టెఫీ గ్రాఫ్ రికార్డును సమం చేశాడు.
పారిస్ వేదికగా ఆదివారం ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్-2022 ఫైనల్ లో విజేతగా నిలిచిన రఫెల్ నాదల్ (స్పెయిన్) కు ఇది 22వ గ్రాండ్ స్లామ్ విజయం. పురుషుల టెన్నిస్ లో ఇప్పటికే అత్యధిక గ్రాండ్ స్లామ్ ట్రోఫీలను సాధించిన నాదల్.. ఇప్పుడిక మార్గరెట్ కోర్ట్ (24 గ్రాాండ్ స్లామ్స్) రికార్డు పై కన్నేశాడు. కానీ అంతకంటే ముందు నాదల్.. అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ ను కూడా దాటాల్సి ఉంది. ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీతో నాదల్.. స్టెఫీ గ్రాఫ్ అత్యధిక గ్రాండ్ స్లామ్ (22) లను సమం చేశాడు.
ఆదివారం జరిగిన ఫైనల్ లో నాదల్.. ప్రపంచ ఐదో ర్యాంకర్, నార్వే కు చెందిన కాస్పర్ రూడ్ పై 6-3, 6-3, 6-0తో గెలుపొందాడు. 2 గంటల 18 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో నాదల్ ఆద్యంతం ఆధిపత్యం చెలాయించాడు. నాదల్ కు ఇది 14వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్. మొత్తంగా 22వది. ఈ క్రమంలో అత్యధిక గ్రాండ్ స్లామ్ టోర్నీ విజేతలెవరో ఇక్కడ చూద్దాం.
అత్యధిక గ్రాండ్ స్లామ్ విజేతలు:
- మార్గరెట్ కోర్ట్ - 24
- సెరెనా విలియమ్స్ - 23 (ఈ ఇద్దరూ మహిళలే)
- రఫెల్ నాదల్ - 22
- స్టెఫీ గ్రాఫ్ - 22
- నొవాక్ జకోవిచ్ - 20
- రోజర్ ఫెదరర్ - 20
పురుషుల సింగిల్స్ లో అత్యధిక గ్రాండ్ స్లామ్ లు నెగ్గింది వీళ్లే :
- రఫెల్ నాదల్ - 22
- నొవాక్ జకోవిచ్ - 20
- రోజర్ ఫెదరర్ - 20
- పీట్ సంప్రాస్ - 14
ప్రస్తుతానికి పురుషుల సింగిల్స్ లో టాప్ లో ఉన్న నాదల్.. తర్వత సెరెనా ను దాటాల్సి ఉంది. ఈ నెలలోనే ఇంగ్లాండ్ వేదికగా వింబూల్డన్ జరగాల్సి ఉంది. మరి వింబూల్డన్ లో రారాజు రోజర్ ఫెదరర్ ఈ యేడు ఆడటం అనుమానంగానే ఉంది. ఈ నేపథ్యలో నాదల్ కు ఇది మంచి అవకాశం. చివరగా యూఎస్ ఓపెన్ కూడా నెగ్గితే మార్గరెట్ కోర్ట్ ను సమం చేసే అవకాశముంటుందని అతడి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతానికి నాదల్ వయసు 36 ఏండ్లు. కాలు నొప్పితో బాధపడుతున్న నాదల్.. వింబుల్డన్ తో పాటు యూఎస్ ఓపెన్ ఆడతాడా..? అనేది అనుమానమే.