US OPEN: నాదల్‌కు భారీ షాక్.. యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం
Rafael Nadal: యూఎస్ ఓపెన్ లో పెను సంచలనం నమోదైంది. కెరీర్ లో 23వ గ్రాండ్ స్లామ్ కోసం ఆడుతున్న స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ కు అనూహ్య ఓటమి ఎదురైంది.
24 ఏండ్ల సుదీర్ఘ కెరీర్ కలిగిన ప్రపంచ రెండో నెంబర్ ఆటగాడు , స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ కల చెదిరింది. కెరీర్ లో 23వ గ్రాండ్ స్లామ్ కోసం ఆడుతున్న నాదల్ కు యూఎస్ ఓపెన్ లో ఊహించిన షాక్ ఎదురైంది. ప్రి క్వార్టర్స్ లో నాదల్.. అమెరికాకు చెందిన ఫ్రాన్సిస్ టియఫో చేతిలో దారుణ ఓటమి చవిచూశాడు. ఆర్థర్ ఆషే స్టేడియంలో కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య జరిగిన నాలుగో రౌండ్ లో నాదల్.. 4-6, 6-4, 4-6, 3-6 తేడాతో టియఫో చేతిలో ఓడాడు. ఈ ఓటమితో రఫెల్ 23 వ గ్రాండ్ స్లామ్ వేటకు బ్రేక్ పడింది.
ప్రి క్వార్టర్స్ లో భాగంగా ఆర్థర్ ఆషే టెన్నిస్ కోర్టులో జరిగిన మ్యాచ్ లో నాదల్ తొలి రౌండ్ లోనే వెనుకబడ్డాడు. అయితే తొలి రౌండ్ ఓడినా తిరిగి పుంజుకుని వందలాది మ్యాచ్ లను గెలిచిన నాదల్ కు టియఫో ఆ అవకాశమివ్వలేదు.
రెండో రౌండ్ లో నాదల్ పైచేయి సాధించినా మూడు, నాలుగు రౌండ్లలో టియఫొ రెచ్చిపోయాడు. తనకంటే మెరుగైన ఆటగాడితో ఆడుతున్నా ఎక్కడా పట్టుకోల్పోకుండా పోరాడాడు. ఫలితంగా టియఫో పోరాటానికి నాదల్ తలవంచక తప్పలేదు.
ఇదిలాఉండగా ఈ ఏడాది వరుసగా రెండు గ్రాండ్ స్లామ్ (ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్) గెలిచి జోరు మీదున్న నాదల్ కు ఇది భారీ షాక్. యూఎస్ ఓపెన్ వంటి మేజర్ టోర్నీ గెలిచి తన కలను సాకారం చేసుకోవాలనుకున్న అతడికి టియఫో ఇచ్చిన షాక్ మాములుది కాదు. ఇప్పటికే వయసు మీదపడి కెరీర్ చరమాంకంలో ఉన్న నాదల్.. తిరిగి వచ్చే ఏడాది జరుగబోయే ఆస్ట్రేలియన్ ఓపెన్ వరకు ఆడగలడా..? అనేది అనుమానమే. వరుసగా గాయాల బారిన పడుతున్న నాదల్ శరీరం కూడా అందుకు సహకరించడం లేదు.
నాదల్ తో మ్యాచ్ ముగిశాక టియఫో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అసలు ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదని.. తన కండ్లను తానే నమ్మలేకుండా ఉన్నానని చెప్పాడు. టియఫో మాట్లాడుతూ.. ‘ఈ సమయంలో ఏం చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. నేను ఆనందం అనే భావనకు మించిన ఫీలింగ్ లో ఉన్నా. ఈ విజయంతో నా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అసలు నేను దీనిని ఇంకా నమ్మడం లేదు. ప్రపంచ గొప్ప ఆటగాళ్లల్లో ఒకడైన నాదల్ ను నేను ఓడించాను. నా కెరీర్ మొత్తంలో ఇదో గొప్ప మ్యాచ్. మ్యాచ్ లో ఏం జరిగిందో కూడా నాకు గుర్తులేదు...’అని భావోద్వేగంతో స్పందించాడు.
ఇక తన ఓటమిపై నాదల్ స్పందిస్తూ.. ‘ఓటమికి నేను సాకులు వెతకదలుచుకోలేదు. మీరు మీ స్థాయిలో ఆడనప్పుడు మీరు గెలవలేరు. నా ప్రత్యర్థి మెరుగైన ఆటగాడు..’ అని చెప్పుకొచ్చాడు. యూఎస్ ఓపెన్ గెలిచి కెరీర్ లో సెరెనా విలియమ్స్ (23 గ్రాండ్ స్లామ్ లు) సరసన నిలవాలని భావించినా నాదల్ కల కలగానే ఉండిపోయింది.