Rafael Nadal: నాదల్ జోరుకు రూడ్ కుదేలు.. 22వ టైటిల్ నెగ్గిన స్పెయిన్ బుల్

French Open 2022: మట్టికోర్టులో తనకు తిరుగులేదని  మరోసారి నిరూపించుకున్నాడు స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్.  ఫ్రెంచ్ ఓపెన్ - 2022 ఫైనల్లో నాదల్.. కాస్పర్ రూడ్ పై ఘన విజయం సాధించాడు.

Rafael Nadal Beats Casper Ruud in French Open Finals, Clinch 22nd Title

సంవత్సరాలు మారినా మట్టి కోర్టులో విజేత మాత్రం మారడం లేదు. ఎర్రమట్టి కోర్టు (క్లేకోర్టు) గా పేరున్న రొలాండ్ గారస్ (ఫ్రెంచ్ ఓపెన్) లో తనకు సాటిలేదని స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ మరోసారి నిరూపించుకున్నాడు. ప్రత్యర్థులు మారాలే తప్ప తాను మాత్రం ఫ్రెంచ్ ఓపెన్  ట్రోఫీని వదలబోనని చాటి చెబుతూ.. ఆదివారం జరిగిన ఫైనల్ లో ఐదో ర్యాంకర్,  నార్వే కు చెందిన కాస్పర్ రూడ్ పై 6-3, 6-3, 6-0తో గెలుపొందాడు. 2 గంటల 18 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో  ఆది నుంచి అంతం వరకు అంతా నాదల్ వన్ మ్యాన్ షో నే.

ఫైనల్ చేరే క్రమంలో దిగ్గజాలైన  జకోవిచ్, అలెగ్జాండర్ జ్వెరెవ్ లను  ఇంటికి పంపిన  నాదల్.. తొలిసారి ఫైనల్ ఆడుతున్న రూడ్ కు విశ్వరూపమే చూపించాడు.   రూడ్ నుంచి నాదల్ కు కనీస ప్రతిఘటన కూడా ఎదురుకాలేదు. కానీ నాదల్ మాత్రం.. అంతగా అనుభవం లేని  రూడ్ పై బలమైన ఏస్ లు, సర్వీస్ షాట్లతో విరుచుకుపడ్డాడు. 

 

ఈ మ్యాచ్ ద్వారా  నాదల్ సాధించిన పలు రికార్డులు : 

-  36 ఏండ్ల 2 రోజులలో 14వ ఫ్రెంచ్ టైటిల్ నెగ్గిన నాదల్.. ఈ క్రమంలో రొలాండ్ గారోస్ నెగ్గిన అతి పెద్ద వయస్కుడిగా రికార్డు సాధించాడు.  గతంలో ఈ రికార్డు ఆండ్రెస్ గిమెనో (1972 లో.. 34 ఏండ్ల 10 నెలలు)  పేరిట ఉండేది. గిమెనో కూడా స్పెయిన్ దేశస్తుడే. 
- 2005 లో 19 ఏండ్ల వయసులో తొలి ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గాడు నాదల్. 17 ఏండ్ల తర్వాత కూడా అదే కసితో  ఆడుతున్నాడు. 
- తన  కెరీర్ లో నాదల్ కు ఇది 22వ గ్రాండ్ స్లామ్  ట్రోఫీ. ఇందులో 14 ట్రోఫీ లు ఫ్రెంచ్ ఓపెన్ వే కావడం విశేషం. మిగిలిన వాటిలో నాలుగు యూఎస్ ఓపెన్, 2 వింబుల్డన్, 2 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉన్నాయి. 
- ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో  నాదల్ గెలిచిన మొత్తం మ్యాచ్ లు - 112 

 

ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గినందుకు గాను  నాదల్  22 లక్షల యూరోలు (రూ. 18 కోట్ల 30 లక్షలు) గెలుచుకున్నాడు. రన్నరప్ రూడ్ కు  11 లక్షల యూరోలు (రూ. 9 కోట్ల 15 లక్షలు) గెలిచాడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios