Fedal Reunion: మళ్లీ జతకట్టనున్న దిగ్గజ టెన్నిస్ ద్వయం నాదల్-ఫెదరర్... ఇక ప్రత్యర్థికి దబిడిదిబిడే..
Laver Cup 2022: ఒకప్పుడు వేదికలతో సంబంధం లేకుండా టెన్నిస్ కోర్టులలో కొదమసింహాల్లా గర్జించిన ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు.. త్వరలో కలిసి ఆడనున్నారు. ఈ ఏడాది...
ఆధునిక టెన్నిస్ యుగంలో దిగ్గజాలుగా పేరుపొందిన ఇద్దరు బలమైన ప్రత్యర్థులు మళ్లీ కలిసి ఆడనున్నారు. ఒకప్పుడు ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్, వింబుల్డన్ వంటి టోర్నీలలో కొదమసింహాల్లా గర్జించిన ఆ ద్వయం.. ఇప్పుడు మళ్లీ ఒకటిగా ఆడనున్నది. స్విట్జర్లాండ్ వెటరన్ రోజర్ ఫెదరర్.. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ లు కలిసి ఆడనున్నారు. ఈ ఇద్దరు గ్రౌండ్ లో ఆడితే మళ్లీ చూడాలని వేచి చూసిన అశేష టెన్నిస్ ప్రేక్షకలోకానికి ఇంతకంటే గుడ్ న్యూస్ ఏముంటుంది..?
2022 సెప్టెంబర్ లో లండన్ వేదికగా లేవర్ కప్ జరుగున్నది. ఈ కప్ లో రోజర్ ఫెదరర్-రఫెల్ నాదల్ ఇద్దరూ కలిసి ఆడనున్నారు. లండన్ లోని ఓ2 ఎరీనా వేదికగా సెప్టెంబర్ 23 నుంచి లేవర్ కప్ ప్రారంభం కానున్నది. ఇందులో యూరప్ జట్టు తరఫున ఫెడల్ (ఫెదరర్-నాదల్ ల పేర్లను కలిపితే వచ్చే పేరును వారి అభిమానులు ఇలా పిలుచుకుంటారు) ఆడనున్నారు.
యూరప్ జట్టు తరఫున వీళ్లిద్దరూ కలిసి ఆడటం ఇది మూడోసారి. గతంలో 2017 ఎడిషన్ లో ప్రేగ్ వేదికగా ముగిసిన లావెర్ కప్ లో ఈ ఇద్దరూ సంయుక్తంగా ఆడారు. దీనిపై ఇటీవలే ఆస్ట్రేలియా ఓపెన్ నెగ్గి రికార్డు సృష్టించిన నాదల్ స్పందిస్తూ.. ‘లండన్ లో మనిద్దరం కలిసి డబుల్స్ ఆడాలని నేను ఫెదరర్ కు సూచించాను. దానికి అతడు ఒప్పుకున్నాడు. ఇక ఇప్పుడు మేం మా కెప్టెన్ జోర్న్ ను ఒప్పించాలి. రోజర్ నా కెరీర్ పై ఎంతో ప్రభావం చూపిన వ్యక్తి. నాకు అతిపెద్ద ప్రత్యర్థియే గాక ఎంతో ఇష్టమైన స్నేహితుడు. మేమిద్దరం కలిసి ఆడటం చాలా గొప్పగా ఉంటుంది. మేమిద్దరం ఇప్పుడు కెరీర్ చరమాంకంలో ఉన్నాం. ఈ సమయంలో కలిసి ఆడటం ఎంతో గొప్ప అనుభవంగా మిగిలిపోతుంది..’ అని నాదల్ అన్నాడు.
ఇక ఇదే విషయమై ఫెదరర్ స్పందిస్తూ.. ‘గతేడాది లేవర్ కప్ ముగిశాక నాదల్ నాకు మెసేజ్ చేశాడు. లండన్ లో జరిగే ఎడిషన్ కు మనిద్దరం కలిసి ఆడదాం అని చెప్పాడు. దీంతో నేనేమీ ఆలోచించకుండా ఓకే చెప్పాను. నాదల్ గొప్ప వ్యక్తి. నాకు స్ఫూర్తిగా నిలుస్తాడు. ఈ కప్ లో ఆడటం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను...’అని అన్నాడు.
కాగా.. ఇటీవలే ముగిసిన ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ లో రష్యా ఆటగాడు మెద్వదేవ్ పై గెలిచిన నాదల్.. అత్యధిక గ్రాండ్ స్లామ్ లు గెలుచుకున్న ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఆధునిక టెన్నిస్ యుగంలో దిగ్గజాలుగా పేరొందిన జొకోవిచ్, ఫెదరర్, నాదల్ త్రయంలో.. అత్యధిక గ్రాండ్ స్లామ్ లు గెలిచిన ఆటగాడు నాదల్. ఆస్ట్రేలియా ఓపెన్ గెలవడంతో అతడి గ్రాండ్ స్లామ్ ల సంఖ్య 21 కి పెరిగింది. జొకోవిచ్, ఫెదరర్.. 20 గ్రాండ్ స్లామ్ లు గెలిచారు.