PV Sindhu: సింధూకు షాక్.. థాయ్లాండ్ ఓపెన్ లో సెమీస్ లోనే నిష్క్రమణ
Thailand Open: తెలుగు తేజం పీవీ సింధూకు థాయ్లాండ్ లో ఓపెన్ లో షాక్ తగిలింది. ఆమె పోరాటం సెమీస్ లోనే ముగిసింది.
రెండు సార్లు ఒలింపిక్ విజేత పీవీ సింధూకు భారీ షాక్ తగిలింది. థాయ్లాండ్ ఓపెన్ లో భాగంగా బ్యాంకాక్ లో జరుగుతున్న పోటీలలో సింధూ పోరాటం సెమీస్ లోనే ముగిసింది. ప్రపంచ నాలుగో సీడ్ చెన్ యూఫీ (చైనా) చేతిలో సైనా ఓటమి పాలైంది. సింధూ.. 17-21. 16-21 తేడాతో చెన్ చేతిలో అపజయాన్ని మూటగట్టుకుంది. రెండు వరుస గేమ్ లను కోల్పోయిన సింధూ.. ఈ ఈవెంట్ నుంచి ఓటమితో నిష్క్రమించింది. 43 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో ఆఖరికి విజయం చెన్ నే వరించింది.
గతేడాది టోక్యో వేదికగా ముగిసిన ఒలింపిక్స్ లో స్వర్ణం నెగ్గిన చెన్ యూఫీ.. తాజాగా సింధూతో పోరులో కూడా జోరు చూపించింది. వరుస సెట్లలో సింధూను కోలుకోనీయకుండా చేసి విజేతగా నిలిచింది.
తొలి సెట్ లోనే సింధూపై ఆధిపత్యం ప్రదర్శంచిన చెన్.. అదే ఆటను ఆధ్యంతం కొనసాగించింది. ఇక రెండో సెట్ ప్రారంభంలో కొంత తనకు అనుకూలతలు లభించినా.. సింధూ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. దీంతో తిరిగి ఆధిక్యంలోకి వచ్చిన చెన్.. సింధూను కోలుకోనీయలేదు. ఈ ఇద్దరూ.. 2019 బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ ఫైనల్స్ లో తలపడగా అప్పుడు కూడా చెన్ యూఫీ నే విజయం సాధించింది.
తాజా ఫలితంతో ఆమె క్వార్టర్స్ లో ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి అకానె యమగూచీని ఓడించిన ఆనందం కూడా మిగులలేదు. క్వార్టర్స్ లో సింధూ.. 21-15, 20-22, 21-13 తేడాతో యమగూచిని ఓడించింది. థాయ్లాండ్ ఓపెన్ ముగియడంతో సింధూ.. జూన్ 7 నుంచి 12 వరకు సాగే మాస్టర్స్ సూపర్ 500 షెడ్యూల్డ్ లో పాల్గొననుంది.