Asianet News TeluguAsianet News Telugu

టెన్నిస్ నెం.1 నోవాక్ జొకోవిచ్‌కి ఊరట.... ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడేందుకు అనుమతించిన న్యాయస్థానం...

వ్యాక్సినేషన్ కోర్సు పూర్తిచేసుకోనందుకు ఆస్ట్రేలియాన్ ఓపెన్‌‌లో పాల్గొనేందుకు నొవాక్ జొకోవిచ్‌ని అనుమతించని ఆస్ట్రేలియా ప్రభుత్వం... న్యాయస్థానంలో జొకోవిచ్‌కి ఊరట..

Novak Djokovic Wins court appeal, free to participate in Australian Open
Author
India, First Published Jan 10, 2022, 1:34 PM IST

టెన్నిస్ స్టార్ ప్లేయర్, వరల్డ్ నెం.1 సెర్భియా టెన్నిస్ దిగ్గజం నోవాక్ జొకోవిచ్‌కి ఎట్టకేలకు ఊరట లభించింది. దాదాపు వారం రోజులుగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్ పాల్గొంటాడా? లేదా? అని సాగిన హై డ్రామాకి తెరపడింది. కరోనా థర్డ్ వేవ్‌, ఒమిక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడంతో ఆస్ట్రేలియా...  వ్యాక్సిన్ కోర్సు పూర్తి చేసుకున్నవారికి మాత్రమే తమదేశంలోకి అనుమతిస్తామని నిబంధనను తీసుకొచ్చింది...

అయితే సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్, కరోనా వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక వైద్య మినహాయింపులతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన తర్వాత ఎయిర్‌పోర్ట్ అధికారులు, జొకోవిచ్‌ని అడ్డుకుని అవమానించారు. 

మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టులో జొకోవిచ్‌ని అడ్డుకున్న అధికారులు, వ్యాక్సినేషన్ మినహాయింపు పొందడానికి అతను సమర్పించిన కారణాలు సరిగా లేవని, క్వారంటైన్ పీరియడ్‌ను పూర్తి చేయకపోతే దేశంలోకి అనుమతించేది లేదంటూ తేల్చి చెప్పేశారు. అంతేకాకుండా వరల్డ్ నెం.1 టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ వీసాను కూడా రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఆస్ట్రేలియా ప్రభుత్వం...

దీంతో జొకోవిచ్, న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాడు. టెన్నిస్ ఫెడరల్ సర్క్యూట్‌తో పాటు ఆస్ట్రేలియన్ ఫ్యామిలీ కోర్టు ఇరువర్గాల వాదనలను విన్న తర్వాత జొకోవిచ్‌కి అనుమతినిచ్చింది. జొకోవిచ్ వీసాను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనేందుకు కూడా అతనికి అనుమతిచ్చింది...

అంతేకాకుండా నొవాక్ జొకోవిచ్‌ చెల్లించిన లీగల్ ఛార్జీలను కూడా అతనికి తిరిగి ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. అయితే ఇమిగ్రేషన్ మినిస్టర్ అలెక్స్ హాకీ తన అధికారాన్ని ఉపయోగించి, నొవాక్ జొకోవిచ్‌ వీసాని తిరిగి రద్దు చేయవచ్చని, అలా చేస్తే వరల్డ్ నెం.1 టెన్నిస్ ప్లేయర్‌పై మూడేళ్ల పాటు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టకుండా నిషేధం విధించే అధికారం కూడా ఉంటుందని తెలిపింది న్యాయస్థానం...

విమానాశ్రయ అధికారులు, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ లేదనే కారణంగా తమతో అమానవీయంగా ప్రవర్తించారని, నీచంగా అవమానించారని ఆరోపించారు నోవాక్ జొకోవిచ్ తండ్రి. నోవాక్ జొకోవిచ్‌కి జరిగిన ఈ సంఘటనపై టెన్నిస్ ప్రపంచం స్పందించింది. జొకోవిచ్‌కి సపోర్ట్ చేస్తూ, 'We stand with Novak Djokovic' అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు టెన్నిస్ ఫ్యాన్స్...

2021, డిసెంబర్ 16న నొవాక్ జొకోవిచ్‌కి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఈ విషయం ఇప్పటిదాకా బయటికి రాలేదు. 2022, జనవరి 8న కోర్టు విచారణలో జొకోవిచ్‌కి కరోనా సోకినట్టు తేలింది.  దీంతో ఈ వివాదం మరింత ముదిరినట్టైంది. ఎట్టకేలకు న్యాయస్థానం, జొకోవిచ్‌కి సపోర్ట్ చేయడంతో వారం పాటు కొనసాగిన హై డ్రామాకి తెర పడింది....

2008 నుంచి 9 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ గెలిచిన నోవాక్ జొకోవిచ్, 2019 నుంచి వరుసగా మూడు సీజన్లలోనూ టైటిల్స్ గెలిచాడు. గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌లో రష్యన్ టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వేదెవ్‌‌ను ఫైనల్‌లో 7-5, 6-2, 6-2 తేడాతో ఓడించి టైటిల్ సాధించాడు నోవాక్ జొకోవిచ్... 

ఈ ఏడాది జనవరి 17 నుంచి జనవరి 30 వరకూ ఆస్ట్రేలియన ఓపెన్ 2022 టోర్నీ జరగనుంది. 11 సార్లు డబుల్స్ టైటిల్స్ గెలిచిన చెక్ రిప్లబిక్ టెన్నిస్ ప్లేయర్ రెనటా వొరకోవా కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం తన వీసాను రద్దు చేసినట్టు ప్రకటించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios