జయహో జకోవిచ్.. ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా పదో టైటిల్ కైవసం.. నాదల్ రికార్డు సమం

Australia Open 2023: టెన్నిస్ రారాజు నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ లో సంచలన విజయం సాధించాడు. అతడికి ఇది పదో ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్. పది సార్లూ అతడే విజేత. ప్రతీ ఏడాది ప్రత్యర్థులు మారుతున్నా విజేత మాత్రం అతడే.

Novak Djokovic Wins 10th Australia Open Title, Beats Stefanos Tsitsipas in Melbourne MSV

సెర్బియా  సింహం  నొవాక్ జకోవిచ్ తనకు అచ్చొచ్చిన ఆస్ట్రేలియాలో మళ్లీ గర్జించింది.   గతేడాది కరోనా టీకా వేసుకోలేదని తనను అవమానించి పంపించిన చోటే.. ఏడాది తిరిగేలోగానే అదే గడ్డమీద గ్రాండ్ స్లామ్ విక్టరీతో గర్జించాడు జకోవిచ్.  ఆదివారం  మెల్‌బోర్న్ వేదికగా ముగిసిన  పురుషుల సింగిల్స్ ఫైనల్స్ లో  జకో..  6-3, 7-6 (7-4), 7-6 (7-5) తేడాతో  గ్రీస్ కుర్రాడు  స్టెఫనోస్ సిట్సిపాస్ పై సంచలన విజయాన్ని అందుకున్నాడు.  

ఆట ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన జకో..  అదే జోరు కొనసాగించాడు. స్టెఫనోస్..   రెండు, మూడు సెట్లలో  పుంజుకున్నా జకో అతడికి  అవకాశమివ్వలేదు. చివరి రెండు  సెట్లలో ఇద్దరూ కొదమసింహాల్లా కొట్లాడినా  విజేత మాత్రం సెర్బియా స్టారే..  

ఈ విజయంతో  జకోవిచ్  పలు  రికార్డులు సృష్టించాడు.  జకోకు ఇది పదో ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్. పది సార్లు  అతడే విజేత.   ప్రతీ ఏడాది ప్రత్యర్థులు మారుతున్నా విజేత మాత్రం అతడే. గతేడాది  జకోవిచ్  ఈ టోర్నీకి  దూరం కావడంతో  నాదల్.. ఆస్ట్రేలియా ఓపెన్ గెలుచుకున్నాడు.   నాదల్ కు  ఆ టైటిల్ 21వది.  తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ కూడా నెగ్గిన  నాదల్.. పురుషుల సింగిల్స్ లో అత్యధిక  టైటిళ్లు  (22) సాధించిన ఆటగాడిగా ఉన్నాడు.   తాజాగా జకో..   నాదల్ రికార్డును సమం చేశాడు.  ఆస్ట్రేలియా ఓపెన్  జకోవిచ్ కు 22వది కావడం గమనార్హం. 

 

ఆస్ట్రేలియా ఓపెన్ విజయంతో  జకో.. మళ్లీ ప్రపంచ పురుషుల  టెన్నిస్ లో నెంబర్ వన్  స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.  ఫైనల్ లో విజయం తర్వాత  జకోవిచ్ మాట్లాడుతూ.. ‘పెద్ద కలలు కనండి.  ఏదైనా సాధ్యమవుతుంది. మీరు ఎక్కడ్నుంచి  వచ్చారనేది  అనవసరం. మీరు ఎంత కఠినమైన సవాళ్లు ఎదురైతే అంత రాటుదేలుతారు.  స్టెఫనోస్, నేను దానికి ప్రత్యక్ష ఉదాహరణ. పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే నా కెరీర్ లో ఇదే అతిపెద్ద విజయం...’అని అన్నాడంటే గతేడాది  ఆస్ట్రేలియా ప్రభుత్వపు  అవమానాలు జకోను ఎంతగా వేధించాయో అర్థం చేసుకోవచ్చు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios