నాదల్ కాదు నాగల్... కన్ప్యూజ్ అయ్యావా..?: యాంకర్ ప్రశ్నకు ఫెదరర్ సమాధానమిదే
అతడు నాగలా లేక నాదలా...ఈ కన్ప్యూజన్ ఇప్పుడు అందరిలో మొదలయ్యింది. ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ లో టెన్నిస్ దిగ్గజం ఫెదరర్ ను భారత క్రీడాకారుడు తన అద్భుత ప్రదర్శనతో బెంబేలెత్తించి ఈ కన్ప్యూజన్ సృష్టించాడు.
సుమిత్ నాగల్... ఓవర్ నైట్ లో స్టార్ గా మారిన టీమిండియా టెన్నిస్ క్రీడాకారుడు. తొలి గ్రాండ్ స్లామ్ లోనే ప్రపంచ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ని ముచ్చెమటలు పట్టించి సత్తా చాటాడు. ఆరంభం నుండే దూకుడు ప్రదర్శించిన నాగల్ తొలి సెట్ ను 6-4 తేడాతో గెలుచుకుని షాకిచ్చాడు. ఆ తర్వాత ఫెదరర్ పుంజుకుని వరుస సెట్లలో 6-1,6-2,6-4 తేడాతో పైచేయి సాధించాడు. అయితే మొదటి సెట్లో గెలవడం ద్వారా ఫెదరర్ వంటి టెన్నిస్ దిగ్గజాన్ని బెంబేలెత్తించిన నాగల్ పై యావత్ క్రీడా ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోంది.
అయితే ఈ మ్యాచ్ అనంతరం ఓ విలేకరి ఫెదరర్ ను అడిగిన ప్రశ్నపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ''మీకు నాగల్ తో పోటీపడుతున్నానా లేదా నాదల్ తోనా'' అన్న అనుమానం ఈ మ్యాచ్ సందర్భంగా కలిగిందా అంటూ పెదరర్ ను సరదాగా ప్రశ్నించాడు. అందుకు ఆయన సింపుల్ గా కాదంటూ సమాదానం చెప్పాడు.
అయితే ఇదే ప్రశ్నకు సోషల్ మీడియాలో అభిమానులు వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు. '' నాదల్, నాగల్ పేర్లు ఒకేలా వున్నాయి కాబట్టి పెదరర్ కన్ప్యూజ్ అయినట్టున్నాడు'' అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో ''నాగల్, నాదల్... పేర్లే కాదు ఆటతీరు కూడా ఒకేలా వుంది. వీరిద్దరూ ప్రదాన ప్రత్యర్థి ఫెదరరే కావడం విశేషం.'' అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలా తాజాగా #NagalOrNadal అన్న యాష్ ట్యాగ్ ట్రెండింగ్ గా మారింది.
స్విట్జర్లాండ్ కు చెందిన మూడో సీడ్ టెన్నిస్ ఛాంపియన్ ఫెదరర్ యూఎస్ ఓపెన్ లో తడబడ్డాడు. న్యూయార్క్ వేదికన జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ లో 190 ర్యాంక్ సుమిత్ నాగల్ చేతిలో మొదటి రౌండ్లో ఓటమిపాలయ్యాడు. ఆ తర్వాత తేరుకున్న 38ఏళ్ల ఛాంపియన్ వరుస సెట్లను గెలుచుకున్నాడు. ఇలా తన కెరీర్లో 1,224వ విజయాన్ని అందుకున్నాడు.
అయితే గ్రాండ్‌స్లామ్ మెయిన్ డ్రాలో గత 20 ఏళ్లలో ఓ సెట్ గెలుచుకున్న నాలుగో భారత ఆటగాడిగా సుమిత్ నిలిచాడు. ఓడిపోయినప్పటికీ... ఫెదరర్ వంటి దిగ్గజానికి చెమటలు పట్టించాడని అతనిని అభిమానులు ప్రశంసిస్తున్నారు.