Asianet News TeluguAsianet News Telugu

French Open: గాయాలైనా నాదల్ నా రికార్డులను బ్రేక్ చేస్తాడు.. అతడు సూపర్ మ్యాన్.. నవ్రతిలోవా కామెంట్స్

French Open: మట్టికోర్టు మహారాజు రఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. బుధవారం జరిగిన క్వార్టర్స్ లో అతడు..  ప్రపంచ నెంబర్ వన్ జొకోవిచ్ ను ఓడించి సెమీస్ చేరాడు. 

Martina Navratilova Hails Rafael Nadal, Says He will Break Her Records
Author
India, First Published Jun 2, 2022, 5:01 PM IST

ఎర్రమట్టి కోర్టులపై తనకు తిరుగులేదని నిరూపిస్తూ ఫ్రెంచ్ ఓపెన్ లో  స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు.  పారిస్ వేదికగా జరుగుతున్న ఈ  ఏడాది రెండో గ్రాండ్ స్లామ్ ఈవెంట్ లో  భాగంగా.. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ లో నాదల్.. ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ స్టార్ జొకోవిచ్ (సెర్బియా) ను ఓడించి సెమీస్ చేరాడు.  ఈ క్రమంలో అతడు ఒక గ్రాండ్ స్లామ్ ఈవెంట్ లో అత్యధిక విజయాలు సాధించిన రెండో టెన్నిస్ స్టార్ గా రికార్డులకెక్కాడు. ఈ  నేపథ్యంలో  పాత తరపు టెన్నిస్ స్టార్ మార్టినా నవ్రతిలోవా నాదల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

నాదల్ తన రికార్డులను బద్దలుకొడతాడని, అతడికి ఆ సత్తా ఉందని నవ్రతిలోవా తెలిపింది.  ట్విటర్ వేదికగా ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ఓ ట్వీట్ కు రిప్లై ఇస్తూ.. నాదల్ తన రికార్డులను బ్రేక్ చేయడమే గాక  అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్నర్ గా నిలవాలని ఆకాంక్షించింది. 

నేషన్స్ లీగ్ అనే ట్విటర్ ఖాతాలో.. ‘ఒక గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ లో అత్యధిక విజయాలు సాధించిన ఆటగాళ్లు.. నవ్రతిలోవా (120 విజయాలు.. వింబుల్డన్ లో), రఫెల్ నాదల్ (110 విజయాలు.. ఫ్రెంచ్ ఓపెన్ లో) అని ట్వీ్ చేసింది’.  ఈ ట్వీట్ కు నవ్రతిలోవా స్పందిస్తూ.. ‘ఆ రికార్డును రఫా బద్దలు కొడతాడు. నాకు ఆ నమ్మకముంది. అలా జరిగితే నేనేమీ బాధపడను..’ అని ట్వీట్ చేసింది.

 

నాదల్.. తన రికార్డుతో పాటు అత్యధిక గ్రాండ్ స్లామ్ లు సాధించిన రికార్డు కూడా నెలకొల్పాలని   నవ్రతిలోవా గతంలో ఆశించింది.  ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచిన తర్వాత  ఆమె మాట్లాడుతూ.. ‘అతడు సాధిస్తాడు. ఇప్పటికీ ఆడుతున్నాడు కదా. నాదల్ ఎంతకాలం ఆడతాడో తెలియదు. కానీ టెన్నిస్ ప్రపంచం మాత్రం అతడిని కోరుకుంటున్నది. ఎన్నిగాయాలైనా అతడు గోడకు కొట్టిన బంతిలా తిరిగి వస్తున్నాడు. అతడు సూపర్ మ్యాన్. కాలంతో పరుగెత్తుతాడు’అని తెలిపింది. 

ఆస్ట్రేలియా ఓపెన్ నాదల్ ఖాతాలో 21 వ టైటిల్.  ప్రపంచ పురుషుల టెన్నిస్ చరిత్రలో ఇప్పటివరకు రోజర్ ఫెదరర్, నొవాక్ జకోవిచ్, రఫెల్ నాదల్ పేరు మీద ఉండే 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ రికార్డును అతడు బద్దలుకొట్టాడు.  ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి 21 వ టైటిల్ సొంతం చేసుకున్నాడు. కాగా.. టెన్నిస్ లో ఇప్పటివరకు అత్యధిక గ్రాండ్ స్లామ్ లు గెలిచిన ప్లేయర్ గా మహిళా టెన్నిస్ దిగ్గజం మార్గరేట్ కోర్ట్ (24 గ్రాండ్ స్లామ్) పేరిట ఉంది.  ఆ తర్వాత సెరెనా విలియమ్స్ (23), స్టెఫీ గ్రాఫ్ (22) ఉన్నారు. మార్టినా నవ్రతిలోవా.. 18 గ్రాండ్ స్లామ్స్ నెగ్గింది. 

ఇదిలాఉండగా ఫ్రెంచ్ ఓపెన్ లో భాగంగా నాదల్.. శుక్రవారం జరిగే సెమీస్ పోరులో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) తో తలపడతాడు. ఫ్రెంచ్ ఓపెన్ ను 2005  నుంచి 2014 దాకా.. 2017 నుంచి 2020 వరకు.. మొత్తంగా 13 సార్లు నాదల్ నెగ్గాడు. ఈసారి  ఆస్ట్రేలియా ఓఓపెన్ గెలిచి  జోరుమీదున్న  నాదల్.. ఫ్రెంచ్ ఓపెన్ కూడా గెలవాలని భావిస్తున్నాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios