ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జా పెళ్లి ఘనంగా జరిగింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ కుమారుడు అసద్ తో... ఆనమ్ వివాహం జరిగింది. బుధవారం జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే నెట్టింట వైరల్ గా మారాయి.

కాగా... గురువారం ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానంతో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ కి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్ఛాలను కూడా అందజేశారు.

ఈ రిసెప్షన్ లో ఆనమ్ అసద్ ల జంట అతిథులను ఆకట్టుకుంది. ఇద్దరూ ఎంతో అందంగా ముస్తాబయ్యారు. ఆనమ్ బంగారు వర్ణం కలిగన గౌను ధరించగా.. అసద్.. బ్లాక్ సూట్ వేసుకున్నారు.ఇక సానియా మీర్జా కూడా మెరూన్ రంగు లెహంగాలో మెరిసిపోయారు. పెళ్లికి రెండు రోజుల ముందు అజారుద్దీన్, సానియా మీర్జా, అసద్ లు సీం కేసీఆర్ ని కలిసి ప్రత్యేకంగా రిసెప్షన్ కి రావాల్సిందిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా.... ఆనమ్- అసద్ ల పెళ్లి బుధవారం జరిగింది. బంధుమిత్రుల సమక్షంలో బుధవారం రాత్రి జరిగిన వీరి పెళ్లి కోలాహలంగా సాగింది. పెళ్లి అనంతరం ఆనంమీర్జా ‘మిస్టర్ అండ్ మిసెస్’ ట్యాగ్ లైన్ తో  ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. పెళ్లి వేడుకలో గులాబీ రంగు లెహంగా, వైన్ రంగు భారీ దుపట్టా, బంగారు ఆభరణాలు ధరించిన ఆనంమీర్జా మెరిశారు.

వరుడు అసద్ క్రీమ్ కలర్ షెర్వానీతోపాటు తలపాగా పెట్టుకున్నారు. ఆనంమీర్జా పెట్టిన పెళ్లి ఫోటోలకు పలువురు నెటిజన్లు లైక్స్, కామెంట్లు పెట్టారు.టాలీవుడ్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా ఈ పెళ్లి ఫోటోలకు స్పందించారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి రెండు రోజుల క్రితం జరిగిన మెహందీ ఫంక్షన్ సందర్భంగా పెళ్లి కుమార్తె ఆనంమీర్జాకు గోరింటాకు పెట్టారు.

చేతులకు గోరింటాకు పెట్టుకొని నీలంరంగు లంగా ఓణీతో ముస్తాబైన ఆనంమీర్జాతో కలిసి దిగిన మెహందీ ఫంక్షన్ ఫొటోలను సానియామీర్జా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. ఈ ఫోటోలు కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి.