55ఏళ్ల తర్వాత మళ్లీ.... పాకిస్థాన్ పర్యటనకు భారత టెన్నిస్ టీం
భారత్ కు చెందిన టెన్నిస్ ప్లేయర్లు పాకిస్థాన్ లో పర్యటించనున్నట్లు ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ప్రకటించింది. ఇస్లామాబాద్ వేదికన జరిగే డేవిస్ కప్ లో పాకిస్థాన్ ఆటగాళ్లతో భారత ప్లేయర్స్ సింగిల్స్, డబుల్ విభాగాల్లో తలపడనున్నారు.
భారత్ -పాకిస్థాన్... ఈ రెండు దాయాది దేశాల మధ్య గతకొన్నేళ్లుగా దైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ముంబై దాడుల్లో పాకిస్థాన్ హస్తముందని గుర్తించిన భారత్ ఆ దేశంతో సంబంధాలను పూర్తిగా తెంచుకుంది. కేవలం రాజకీయ, వాణిజ్య సంబంధాలనే కాదు ఎన్నోఏళ్లుగా కొనసాగిన క్రీడా సంబంధాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే తాజాగా భారత టెన్నిస్ ఆటగాళ్లతో కూడిన ఓ బృందం పాకిస్థాన్ లో పర్యటించడానికి సిద్దమయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హిరన్మయ్ చటర్జీ వెల్లడించారు.
''ప్రతిష్టాత్మక డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు భారత ఆటగాళ్లు పాకిస్థాన్ కు వెళ్లనున్నారు. ఇది ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక సీరిస్ కాదు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న టోర్నీ. కాబట్టి నిబంధనలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ పాకిస్థాన్ పర్యటనపై భారత ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తమవలేదు.
1964 సంవత్సరం లాహోర్ లో జరిగిన డేవిస్ కప్ లో భారత ఆటగాళ్లు చివరిసారిగా పాక్ తో తలపడ్డారు. అందులో భారత్ 4-0 తేడాతో పాక్ ను వారి స్వదేశంలోనే మట్టికరిపించి సత్తా చాటింది. 55 ఏళ్ల తర్వాత మళ్లీ భారత టెన్నిస్ బృందం పాక్ లో అడుగుపెట్టబోతొంది.'' అని చటర్జీ మీడియాకు వెల్లడించారు.
పాకిస్థాన్ లో పర్యటించే భారత ఆటగాళ్లు వీరే:
పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ వేదికన జరగనున్న డేవిస్ కప్ లో పాల్గోనే ఆటగాళ్లను ఏఐటిఏ జనరల్ సెక్రెటరీ చటర్జీ ప్రకటించారు. సెప్టెంబర్ 14, 15 తేదీల్లో ఈ టోర్నీ జరగనుంది.
ప్రజ్నేశ్ గుణేశ్వరన్, రామ్ కుమార్ రామనాథన్ భారత్ తరపున సింగిల్స్ ఆడనున్నారు. అలాగే రోహన్ బోపన్న, దివిజ్ శరన్ లు డబుల్స్ ఆడనున్నారు. వీరితో పాటు టెన్నిస్ కోచ్ జీషన్ అలీ కూడా పాకిస్థాన్ లో పర్యటించనున్నారు.