US Open: తొలిసారి యూఎస్ ఓపెన్ సెమీస్ చేరిన స్వియాటెక్.. తొలి గ్రాండ్‌స్లామ్‌కు రెండడుగుల దూరంలో ఫ్రాన్సిస్
US Open 2022: యూఎస్ ఓపెన్ క్వార్టర్స్ పోటీలు ముగింపు దశకు చేరుకున్నాయి. పురుషుల, మహిళల సింగిల్స్ లో ఇప్పటికే పలువురు సెమీస్ పోరుకు అర్హత సాధించారు.
ప్రపంచ మహిళల టెన్నిస్ నెంబర్ వన్, పోలండ్ సంచలనం ఇగా స్వియాటెక్ తన కెరీర్ లో తొలిసారి యూఎస్ ఓపెన్ సెమీస్ కు ప్రవేశించింది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం జరిగిన యూఎస్ ఓపెన్ మహిళల క్వార్టర్స్ లో స్వియాటెక్.. 6-3, 7-6 (7/4) తేడాతో యునైటైడ్ స్టేట్స్ కు చెందిన జెస్సిక పెగులాను ఓడించింది. పురుషుల సింగిల్స్ లో ప్రి క్వార్టర్స్ లో రఫెల్ నాదల్ ను ఓడించిన అమెరికా సంచలనం ప్రాన్సిస్ టియోఫో.. ఆండ్రీ రూబ్లేవ్ ను ఓడించి సెమీస్ కు అర్హత సాధించాడు.
క్వార్టర్స్ పోరులో భాగంగా స్వియాటెక్.. తన ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా ఆడింది. తొలి సెట్ ను 6-3తో గెలుచుకున్న ఆమె రెండో సెట్ ను కూడా గెలుచుకుంది. సెమీస్ లో ఆమె అరిన సబలెంక తో పోటీ పడనుంది. ఈ మ్యాచ్ లో నెగ్గితే ఆమె ఫైనల్ కు అర్హత సాధిస్తుంది.
మరో మహిళల సింగిల్స్ క్వార్టర్స్ లో అరినా సబలెంక.. 6-1, 6-7 (4/7) తేడాతో కరోలినా ప్లిస్కోవాను చిత్తు చేసింది. స్వియాటెక్ తో పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ఆమె మ్యాచ్ అనంతరం తెలిపింది.
ఇక పురుషుల సింగిల్స్ లో ఫ్రాన్సిస్ టియోఫో 7-6, 7-6 , 6-4 తేడాతో ఆండ్రీ రుబ్లేవ్ ను ఓడించాడు. తద్వారా అతడు యూఎస్ ఓపెన్ సెమీస్ చేరాడు. టియోఫోకు కూడా ఇదే తొలి యూఎస్ ఓపెన్ సెమీస్ కావడం విశేషం. మరో క్వార్టర్స్ కార్లోస్ అల్కరజ్, జన్నిక్ సిన్నర్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో కార్లోస్.. 6-3, 6-7, 6-7, 7-5, 6-3 తో జన్నిక్ ను ఓడించాడు.