Asianet News TeluguAsianet News Telugu

నా కొడుకు తన తండ్రిని మళ్లీ ఎప్పుడు చూస్తాడో తెలీదు: సానియా మీర్జా భావోద్వేగం

హైద్రాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కు సైతం ఈ లాక్ డౌన్ కష్టాలు తప్పడం లేదు. ఈ లాక్ డౌన్ వల్ల సానియా మీర్జా కొడుకు ఇజాన్ తోసహా మన హైదరాబాద్ లో ఉంటే... సానియా భర్త, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పాకిస్తాన్ సియాల్కోట్ లో ఉండిపోయాడు. 

I don't Know When My Son Will Be Able To See His Father again: Sania Mirza
Author
Hyderabad, First Published May 17, 2020, 9:23 AM IST

కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ వల్ల కుటుంబసభ్యులు వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నవారు చాలామందే ఉన్నారు. ఎంత సెలెబ్రిటీలు అయినా వారికి సైతం ఇవి తప్పడం లేదు. 

మన హైద్రాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కు సైతం ఈ లాక్ డౌన్ కష్టాలు తప్పడం లేదు. ఈ లాక్ డౌన్ వల్ల సానియా మీర్జా కొడుకు ఇజాన్ తోసహా మన హైదరాబాద్ లో ఉంటే... సానియా భర్త, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పాకిస్తాన్ సియాల్కోట్ లో ఉండిపోయాడు. 

తండ్రని చూడకుండా కొడుక్కి, భర్తను చూడకుండా తనకు ఈ కరోనా కష్టకాలం పరీక్షను పెడుతుందని ఆమె ఈ సందర్భంగా అన్నారు. రెండు సంవత్సరాల గ్యాప్ తరువాత టెన్నిస్ రాకెట్ అందుకున్న సానియా మునుపటి ఫామ్ ను దొరకబుచ్చుకునేందుకు అంతర్జాతీయ టోర్నీలు ఆడుతూ ప్రపంచమంతా తిరుగుతోంది. 

కరెక్ట్ గా లాక్ డౌన్ విధించే కొన్ని రోజుల ముందు ఆమె హైదరాబాద్ లో ల్యాండ్ అవగలిగింది. భర్త షోయబ్ మాలిక్ కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడుతూ అక్కడే చిక్కుబడిపోయాడు. షోయబ్ అక్కడ తన 65 సంవత్సరాల తల్లిని చూసుకుంటూ ఉన్నాడని, ఈ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తనకు అక్కడ తన తల్లిని జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు ఆనందంగా ఉందని సానియా అన్నారు. తనక్కడ చిక్కుబడడమే ఒకరకంగా మంచిదయిందని సానియా అభిప్రాయపడ్డారు. 

టెన్నిస్ గురించి తన కెరీర్ గురించి సానియా తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేసారు. గతంలో కూడా ఇలానే ఒకమారు తన కెరీర్ విషయంలో ఆందోళన వ్యక్తం చేసారు. తాను పునరాగమనం చేసిందే టోక్యో ఒలింపిక్స్‌లో ఆడేందుకని, తనలో ఆడగల సత్తా ఇంకా ఉంది కాబట్టే దాని గురించి ఆలోచించానని, ఒలింపిక్స్‌ వాయిదా దురదృష్టవశాత్తూ తనకు ప్రతికూలమే అని సానియా తన మనసులోని అనుమానాన్ని బయటపెట్టింది. 

2021 అంటే ఇంకా చాలా దూరం ఉందని, అత్యున్నత స్థాయిలో ఆట ఆడాలంటే దానికో ప్రక్రియ ఉంటుందని, దానికి సమయం పట్టడం సహజమని సానియా వ్యాఖ్యానించింది. 

టోర్నీల్లో  గెలుపోటములు ఉంటాయన్నా విషయం తనకు తెలుసునని, ఆ స్థాయిలో ఆడేందుకు, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యే వచ్చానని, కానీ ఇప్పుడు అంతా మారిపోతుందని, ఆటలో లయ తప్పుతుంది కాబట్టి మళ్లీ చాలా కష్టపడాల్సి ఉంటుందని సానియా ఆవేదన వ్యక్తం చేసింది. 

 అంతా మంచిగా సాగితే మళ్లీ ఆడతానని, కానీ మరో పునరాగమనం చేయాల్సిన పరిస్థితి వస్తుందేమోననే భయంగా ఉందని తన మనసులోని ఆందోళనలను బయటపెట్టింది. సానియా ప్రస్తుత వయసు 33. 2021 ఒలింపిక్స్ నాటికి 35వ  పడిలో నుంచి 36వ పదిలోకి అడుగుపెట్టేందుకు మరో మూడు నాలుగు నెలల దూరంలో మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సానియా మీర్జా తన వయసుకు సంబంధించి ఆందోళన చెందుతుంది. 

కరోనా తీవ్రత తగ్గి ప్రపంచవ్యాప్తంగా క్రీడలు మొదలైనప్పటికీ.... ఆటలో పాత పద్ధతులకు బదులుగా అంతా కొత్త తరహా వాతావరణం కనిపిస్తుందని సానియా వ్యాఖ్యానించింది. ‘

ఖచ్చితంగా అంతా మారిపోతుందని, ఎంతగా అంటే సరిగ్గా చెప్పలేకపోవచ్చు కానీ...  క్రీడలను అటుంచితే, సాధారణ జీవితం కూడా మారిపోవడం ఖాయమని సానియా అభిప్రాయూయపడింది. మనలో ప్రతీ ఒక్కరు మరొకరిని చూసి భయపడినా ఆశ్చర్యపోనక్కర్లేదని,  ఇప్పటికే చాలా మారిపోతోందని, ఎందరినో కలుస్తున్నా.... ఆత్మీయంగా ఆలింగనం చేసుకోలేకపోతున్నామని, క్రీడలు కూడా చాలా మారిపోతాయని సానియా మీర్జా వాఖ్యానించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios