Japan Open: శ్రీకాంత్‌కు షాక్.. మాజీ వరల్డ్ ఛాంపియన్‌ను ఓడించి క్వార్టర్స్‌కు చేరిన ప్రణయ్
Japan Open 2022: జపాన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో గురువారం ఇద్దరు భారత స్టార్ షట్లర్లు బరిలోకి దిగారు. వీటిలో మనకు మిశ్రమ ఫలితాలొచ్చాయి. హెచ్ఎస్ ప్రణయ్ ముందంజవేశాడు.
టోక్యో వేదికగా జరుగుతున్న జపాన్ ఓపెన్ - 2022లో భారత బ్యాడ్మింటన్ స్టార్ హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ లో ప్రణయ్.. మాజీ వరల్డ్ ఛాంపియన్ లో కీన్ యూ (సింగపూర్) ను మట్టి కరిపించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. 44 నిమిషాల పాటు జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్ లో ప్రణయ్.. 22-20, 21-19 తో లో కీన్ యూను ఓడించాడు. చివరివరకు ఇద్దరూ హోరాహోరి పోరు జరిపినా విజయం మాత్రం ప్రణయ్ నే వరించింది.
ఇక పురుషుల సింగిల్స్ లో భాగంగా మరో ప్రి క్వార్టర్స్ పోరులో కిదాంబి శ్రీకాంత్ కు భారీ షాక్ తప్పలేదు. రెండో రౌండ్ లో శ్రీకాంత్.. జపాన్ కు చెందిన అన్‌సీడెడ్ కంట త్సునెయమ చేతిలో 21-10, 21-16 తేడాతో ఓటమి పాలయ్యాడు. దీంతో రెండో రౌండ్ లోనే ఇంటి బాట పట్టాడు.
జపాన్ ఓపెన్ లో భాగంగా తొలి రౌండ్ లో మలేషియా కు చెందిన అంగుస్ ను ఓడించిన ప్రణయ్.. అదే జోరును ప్రిక్వార్టర్స్ లోనూ కొనసాగించాడు. రెండు రౌండ్లలోనూ కీన్ యూ తీవ్ర పోటీనిచ్చాడు. అయినా ఏకాగ్రత కోల్పోకుండా ఆడిన ప్రణయ్.. విజయం దక్కించుకున్నాడు. కీన్ యూ పై గత నాలుగు మ్యాచ్ లలో ప్రణయ్ కు ఇది మూడో గెలుపు కావడం గమనార్హం. ఇక క్వార్టర్స్ లో అతడు చైనీస్ తైఫీకి చెందిన చో టైన్ చెన్ తో పోటీ పడతాడు.
ఇక బుధవారం ముగిసిన తొలి రౌండ్ లో కిదాంబి శ్రీకాంత్.. జపాన్ కే చెందిన లి జి జియా ను 22-20, 23-21 తేడాతో ఓడించాడు. ఇటీవలే ముగిసిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్-2022లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక తీవ్ర ఒత్తిడిలో ఉన్న శ్రీకాంత్.. జపాన్ ఓపెన్ తొలిరౌండ్ లో మాత్రం ఆత్మవిశ్వాసంతో ఆడాడు. లీ జి జియా తో పోరాడి గెలిచాడు. కానీ రెండో రౌండ్ లో మాత్రం ఆ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. కంట త్సునెయమ చేతిలో 21-10, 21-16 తేడాతో దారుణ ఓటమి చవిచూశాడు. కనీసం పోటీ కూడా ఇవ్వకుండా ప్రత్యర్థికి విజయాన్ని అందించి ఇంటిబాట పట్టాడు.
ఇదిలాఉండగా ఈ టోర్నీలో ఇప్పటికే భారత స్టార్ షట్లర్లు లక్ష్యసేన్, సైనా నెహ్వాల్ లు తొలి రౌండ్ లోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే. పురుషుల డబుల్స్ లో అర్జున్-కపిల ల ద్వయం, మహిళల డబుల్స్ లో జాలీ-గాయత్రి గోపీచంద్ ల జోడీ, మిక్స్డ్ డబుల్స్ లో ప్రసాద్ - దేవాంగన్ ల జంట తొలి రౌండ్ లోనే ఓడి నిరాశపరిచింది.