హోబార్త్: ఆస్ట్రేలియాలోని టాస్మానియా రాజధాని హోబార్త్ లో ప్రతి సంవత్సరం నిర్వహించే హోబార్త్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంటులో రెండు సంవత్సరాల విరామం అనంతరం సానియా మీర్జా తిరిగి రాకెట్ పట్టుకున్న విషయం తెలిసిందే. 

 

తల్లి అయిన తరువాత కొద్దిగా లావైన సానియా మీర్జా ఆట మీద ప్రేమతో ఏకంగా 26 కేజీలు తగ్గి ఫిట్ గా మారి రాకెట్ పట్టింది. గేమ్ లో దుమ్ము దులిపిన సానియా జోడి డబుల్స్ క్వార్టర్ ఫైనల్ లోకి అడుగుపెట్టింది. 

ఆ వెంటనే ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది సానియా. తన జీవితంలో ఇది మర్చిపోలేని రోజు... అంటూ ఈ సందర్భంగా సానియా సంతోషం వ్యక్తం చేసింది. 

ఈరోజు తన జీవితంలో మర్చిపోలేని రోజని,  చాలా కాలం తర్వాత తాను ఆడిన తొలి మ్యాచ్‌లో తనతో పాటు తన కుమారుడు, తల్లిదండ్రులు ఉండడం సంతోషం అని తెలిపింది. తొలి రౌండ్‌లో తాము గెలిచామని చెబుతూ...   తన పట్ల చూపుతున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపింది. 

తనపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు తెలుపుతూ, నమ్మకం అనేది మనిషిని ఎందాకైనా తీసుకెళ్తుందని పేర్కొంది.  చివర్లో తన కొడుక్కిహైఫై ఇస్తున్న ఫోటోను జత చేసి చిన్నోడా వి డిడ్ ఇట్ అని రాసుకొచ్చింది. 

ఉక్రెయిన్ క్రీడాకారిణి నదియా కిచెనోక్‌తో జతకట్టిన సానియా మీర్జా... ఒక్సానా కలష్నికోవా (జార్జియా), మియూ కాటో (జపాన్) జోడీపై 2-6, 7-6 (3), 10-3 తేడాతో విజయం సాధించి క్వార్టర్స్ లోకి అడుగుపెట్టింది.