French Open: మట్టి కోర్టు మహారాణి స్వియాటెక్.. ఫ్రెంచ్ ఓపెన్ నిలబెట్టుకున్న పోలాండ్ భామ
French Open 2023: ఫ్రెంచ్ ఓపెన్ -2023 టైటిల్ ను డిఫెండింగ్ ఛాంపియన్ ఇగా స్వియాటెక్ నిలబెట్టుకుంది. నిన్న రాత్రి జరిగిన మహిళల సింగిల్స్ తుదిపోరులో ఆమె కరోలినా ముచోవాను ఓడించింది.
లేడీ నాదల్‌గా గుర్తింపు దక్కించుకుంటున్న పోలాండ్ సంచలనం ఇగా స్వియాటెక్.. నాదల్ గర్జించిన చోటే సింహాగర్జన చేస్తున్నది. ఎర్రమట్టి కోర్టు మహారాజుగా పేరొందిన నాదల్‌ను తలపిస్తూ ఫ్రెంచ్ ఓపెన్ లో మూడో టైటిల్ నెగ్గింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన వరల్డ్ నెంబర్ వన్ స్వియాటెక్.. ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్ పోరులో 43 వ ర్యాంకర్ అయిన చెక్ రిపబ్లిక్ అమ్మాయి కరోలినా ముచోవాపై 6-2, 5-7, 6-4 తేడాతో విజయం సాధించి 22 ఏండ్ల వయసులోనే మూడో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను సొంతం చేసుకుంది.
తొలి సెట్‌ను ఈజీగా గెలుచుకున్న స్వియాటెక్‌కు ముచోవా రెండో సెట్ లో గట్టిపోటీనివ్వడంతో ఆ సెట్ ను ఆమె కోల్పోవాల్సి వచ్చింది. కానీ మూడో సెట్ లో తిరిగి పుంజుకున్న స్వియాటెక్ ముచోవాను కోలుకోనీయలేదు. 2019లో కరోలినా.. ఇదే ఫ్రెంచ్ ఓపెన్ లో స్వియాటెక్ ను ఓడించింది.
22 ఏండ్ల స్వియాటెక్.. ఈ విజయంతో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అతి పిన్న వయసులోనే ఆడిన నాలుగు గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ గెలుచుకున్న రెండో క్రీడాకారిణిగా నిలిచింది. 2021లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన స్వియాటెక్.. 2022లో కూడా విజేతగా నిలిచింది. ఇక గతేడాది యూఎస్ ఓపెన్ విజేత కూడా ఆమెనే. తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ తో ఆమె ఖాతాలో నాలుగు గ్రాండ్ స్లామ్స్ చేరాయి. ఇందులో మూడు ఫ్రెంచ్ ఓపెన్ వే కావడం గమనార్హం. గతంలో యూఎస్ కు చెందిన మోనికా సీల్స్ ఆడిన నాలుగు ఫైనల్స్ లోనూ విజయం సాధించిన క్రీడాకారణిగా నిలిచింది. జపాన్ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా కూడా ఈ ఘనత సాధించింది.
కాగా స్వియాటెక్ తన కెరీర్ లో 26 గ్రాండ్ స్లామ్ మ్యాచ్ లు ఆడగా ఇందులో రెండు మ్యాచ్ లు మాత్రమే ఓడిపోయింది. ఇది కూడా ఒక రికార్డే. ఫ్రెంచ్ ఓపెన్ - 2023 టైటిల్ నెగ్గినందుకు గాను స్వియాటెక్ కు రూ. 20 కోట్ల క్యాష్ ప్రైజ్ దక్కింది.
ఉమెన్స్ మిక్స్డ్ డబుల్స్ లో కాట్లో (జపాన్) - పజ్ (జర్మనీ) జోడీ ఫైనల్లో 4-6, 6-4, 10-6 తేడాతో ఆండ్రెస్క్యూ (కెనడా)- వీనస్ (ఆస్ట్రేలియా) ను ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల ఫైనల్ లో నేడు నొవాక్ జకోవిచ్ - కాస్పర్ రూడ్ లో తలపడనున్నారు.