US OPEN: తొలి రౌండ్‌లోనే వెనుదిరిగిన ఎమ్మా రడుకాను.. ఒసాకాదీ అదే బాట.. యూఎస్ ఓపెన్‌లో సంచలన ఫలితాలు
US Open 2022: యూఎస్ ఓపెన్-2022 లో సంచలన ఫలితాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహిళల సింగిల్స్ లో స్టార్ క్రీడాకారిణులు తొలి రౌండ్ లోనే ఇంటి బాట పట్టారు.
యూఎస్ ఓపెన్ - 2022లో బుధవారం సంచలన ఫలితాలు వెలువడ్డాయి. మూడో రోజు ఆటలో ఇద్దరు స్టార్ టెన్నిస్ క్రీడాకారిణులు తొలి రౌండ్ లోనే టోర్నీ నుంచి నిష్క్రమించారు. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన బ్రిటన్ అమ్మాయి ఎమ్మా రడుకాను తో పాటు మాజీ ఛాంపియన్ నవోమి ఒసాకా కూడా తొలి రౌండ్ లోనే నిష్క్రమించింది. మహిళల టెన్నిస్ వరల్డ్ నెంబర్ వన్ ఇగా స్వియాటెక్ రెండో రౌండ్ కు చేరింది. పురుషుల సింగిల్స్ లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ రెండో రౌండ్ కు చేరాడు.
బుధవారం జరిగిన యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ తొలి రౌండ్ పోరులో ఎమ్మా రడుకాను.. ఫ్రాన్స్ వెటరన్ టెన్నిస్ స్టార్ అలిజె కార్నెట్ చేతిలో 6-3, 6-3 తేడాతో ఓటమి పాలైంది. గతేడాది యూఎస్ ఓపెన్ గెలిచిన రడుకాను.. ఈసారి ఫస్ట్ రౌండ్ లోనే ఇంటిబాట పట్టడం గమనార్హం.
ఇక నవోమి ఒసాకా.. అమెరికాకు చెందిన 19వ సీడ్ డేనియల్ కాలిన్స్ చేతిలో 7-6 (7-5), 6-3 తేడాతో ఓడింది. 2018, 2020లలో యూఎస్ ఓపెన్ ఛాంపియన్ గా నిలిచిన ఒసాకా.. గడిచిన కొంతకాలంగా ఫామ్ కోల్పోయి సతమతమవుతున్నది. తనకు అచ్చొచ్చిన యూఎస్ ఓపెన్ లో అయినా ఒసాకా తిరిగి పుంజుకుంటుందని భావించినా.. ఆమె మాత్రం పేలవ ప్రదర్శనతో ఇంటిబాట పట్టింది.
ఇక ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచిన ఇగా స్వియాటెక్.. జాస్మిన్ పవొలినిని 6-3, 6-0 తేడాతో ఓడించి రెండో రౌండ్ కు దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్ లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ కెరీర్ లో 23వ గ్రాండ్ స్లామ్ కోసం చురుగ్గా కదులుతున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత వింబూల్డన్ లో సెమీస్ లోనే గాయం కారణంగా వెనుదిరిగిన నాదల్.. కాస్త విరామం తర్వాత మళ్లీ దుమ్మురేపాడు. యూఎస్ ఓపెన్ తొలి రౌండ్ గండాన్ని విజయవంతంగా అధిగమించాడు. తొలి రౌండ్ లో నాదల్.. ఆస్ట్రేలియన్ ఆటగాడు రింకీ హిజికాటాను 4-6, 6-2, 6-3, 6-3తో ఓడించి రెండో రౌండ్ కు దూసుకెళ్లాడు.
దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ మ్యాచ్ లో నాదల్ తొలి సెట్ ను కోల్పోయినా మిగిలిన మూడు సెట్లలో మాత్రం ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా ఆడాడు. వరుసగా మూడు సెట్లతో పాటు మ్యాచ్ ను కూడా కైవసం చేసుకున్నాడు. రెండో రౌండ్ లో అతడు.. ఇటలీకి చెందిన ఫాబియో ఫోగ్నినితో తలపడనున్నాడు. నాదల్ ఖాతాలో ఇప్పటికే నాలుగు యూఎస్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి.