వరల్డ్ నెంబర్ వన్ స్టార్‌కు షాక్.. ప్రిక్వార్టర్స్ లోనే ఇంటిబాట పట్టిన స్వియాటెక్..
Australian Open: మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్ లో సంచలన ఫలితాలు నమోదవుతున్నాయి. మహిళల టెన్నిస్ లో ప్రపంచ నెంబర్ వన్ ఇగా స్వియాటెక్.. ప్రిక్వార్టర్స్ లోనే ఇంటిబాట పట్టింది.
మహిళల టెన్నిస్ లో ప్రపంచ నెంబర్ వన్ గా ఉన్న పోలండ్ స్టార్ ఇగా స్వియాటెక్ కు ఆస్ట్రేలియా ఓపెన్ - 2023లో ఊహించిన షాక్ తాకింది. మహిళల సింగిల్స్ విభాగంలో భాగంగా ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్ లో కజకిస్తాన్ సంచలనం ఎలెనా రైబాకినా చేతిలో 6-4, 6-4 తేడాతో ఓడింది. వరుస సెట్లలో ఓడిన స్వియాటెక్.. టైటిల్ ఫేవరేట్లలో ఒకరుగా ఉన్న విషయం తెలిసిందే. గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ తో పాటు యూఎస్ ఓపెన్ నెగ్గి జోరుమీదున్న స్వియాటెక్.. ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్ లో గెలవాలనుకుంది. కానీ రైబాకినా ఆమె ఆటలు సాగనివ్వలేదు. ప్రత్యర్థిని కట్టడి చేయడమే గాక దూకుడుగా ఆడి క్వార్టర్స్ కు చేరువైంది.
ఇదిలాఉండగా గతేడాది వింబూల్డన్ ఛాంపియన్ గా అవతరించిన రైబాకినా ఇటీవల కాలంలో సంచలన విజయాలతో స్టార్లకు షాకులిస్తున్నది. ఆస్ట్రేలియా ఓపెన్ లో క్వార్టర్స్ కు చేరడం ఆమెకు ఇదే తొలిసారి. ఇక గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్ నెగ్గిన ఆ దేశపు క్రీడాకారిని ఆష్లే బార్టీ ఈ ఏడాది పోటీలో లేకపోవడంతో మహిళల సింగిల్స్ ఎవరవుతారా..? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలాఉండగా ఆస్ట్రేలియా ఓపెన్ లో సంచలనాలు నమోదవుతున్నాయి. పురుషుల సింగిల్స్ లో డిఫెండింగ్ ఛాంపియన్ రఫెల్ నాదల్ తో పాటు రష్యన్ ప్లేయర్ మెద్వెదెవ్ కూడా ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. మరోవైపు గతేడాది కరోనా నిబంధనల కారణంగా ఈ టోర్నీ ఆడని వరల్డ్ నెంబర్ వన్ నొవాక్ జొకోవిచ్.. ఆస్ట్రేలియా ఓపెన్ నాలుగో రౌండ్ కు చేరుకున్నాడు. శనివారం మూడో రౌండ్ లో అతడు.. 7-6, (9-7), 6-3, 6-4తో బల్గేరియాకు చెందిన 27వ సీడ్ దిమిత్రోవ్ పై విజయం సాధించాడు. తొడ కండరాలు పట్టేసినా ఆ నొప్పితోనే జొకోవిచ్ ఆడి గెలిచాడు. బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే పోరు కూడా మూడో రౌండ్ లోనే ముగిసింది.