ఆస్ట్రేలియా ఓపెన్ లో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. టాప్ సీడ్ ఆష్లే బార్టీ ఘెర ఓటమిని చవిచూసింది. క్వార్టర్స్ లోనే వెను దిరిగింది. 25వ సీడ్‌ కరోలినా ముచోవా చేతిలో 6-1,3-6,2-6 తేడాతో ఓడి బార్టీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి సెట్‌లో 6-1తో వెనుకబడిన ముచోవా.. రెండో సెట్‌లో ఫుంజుకొని 3-6తో సెట్‌ను గెలుచుకుంది. కీలకమైన మూడోసెట్‌లోనూ ముచోవా అదే జోరు కొనసాగించి 2-6తో సెట్‌ను కైవసం చేసుకోవడంతో పాటు మ్యాచ్‌ను గెలుచుకొని సెమీస్‌కు ప్రవేశించింది.

22వ సీడ్‌ జెన్నిఫర్‌ బ్రాడీ, అన్‌సీడెడ్‌ జెస్సికా పెగులా మధ్య జరిగే మ్యాచ్‌ విజేతతో ముచోవా సెమీస్‌లో తలపడనుంది. కాగా మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌ మ్యాచ్‌లో పదో సీడ్‌ సెరెనా 6–3, 6–3తో రెండో సీడ్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా)పై గెలుపొంది సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో నయామి ఒసాకాతో సెరెనా తలపడనుంది.