Australian Open: చరిత్ర సృష్టించిన ఆష్లే బార్టీ.. 32 ఏండ్ల తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లోకి..
Ashleigh Barty Moves Into Australian Open Final: ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సెమీస్ లో కీస్ ను ఓడించి ఫైనల్ కు చేరిన బార్టీ.. 32 ఏండ్ల రికార్డును బద్దలు కొట్టింది. ఫైనల్లో ఆమె నెగ్గితే అది చరిత్రే...
ప్రపంచ మహిళల టెన్నిస్ నెంబర్ వన్ స్టార్ ఆష్టే బార్టీ సంచలనం సృష్టించింది. ఆస్ట్రేలియా ఓపెన్ లో భాగంగా గురువారం ముగిసిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఆమె అమెరికా టెన్నిస్ క్రీడాకారిణి మేడిసన్ కీస్ ను ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది. తద్వారా 32 ఏండ్ల రికార్డును బద్దలు కొట్టింది. 32 ఏండ్ల తర్వాత తొలిసారిగా ఆస్ట్రేలియా ఓపెన్ లో ఫైనల్ కు ప్రవేశించిన తొలి క్రీడాకారిణిగా సరికొత్త చరిత్ర సృష్టించింది.
గురువారం ఆష్లే.. 6-1, 6-3 తేడాతో మేడిసన్ ను చిత్తుగా ఓడించింది. గంటా 2 నిమిషాల పాటు సాగిన సెమీఫైనల్ పోరులో రెండు సెట్లలోనూ ఆష్లే ఆధిపత్యం సాధించింది. తొలి సెట్ ను అలవోకగా (6-1)గా నెగ్గిన ఆష్లే.. రెండో సెట్లో కొంచెం ప్రత్యర్థి నుంచి కొంత ప్రతిఘటన ఎదుర్కుంది. కానీ అద్భుతమైన సర్వీసులతో ఆమెను చిత్తుచేసింది. తద్వారా ఫైనల్ కు దూసుకెళ్లింది.
ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సెమీస్ లో కీస్ ను ఓడించి ఫైనల్ కు చేరిన బార్టీ.. తుది పోరులో ఏడో సీడ్ క్రీడాకారిణి స్వియాటెక్ (పోలాండ్) ను గానీ లేదంటే 27వ సీడ్ డానియల్ కొలిన్స్ (అమెరికా) తో గానీ తలపడే అవకాశముంది. ఫైనల్లో ఆష్లే గెలిస్తే అది చరిత్రే కానుంది.
ఎందుకంటే...
1980 తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఫైనల్ కు చేరిన తొలి మహిళా క్రీడాకారిణి ఆష్లే.. అంతకుముందు ఈ ఘనత సాధించిన ప్లేయర్ గా టర్న్బల్ నిలిచింది. ఇప్పుడు ఈ రికార్డును బార్టీ సవరించింది. అయితే ఫైనల్ కు చేరిన టర్న్బల్ గెలవలేదు. ఒకవేళ బార్టీ గనక విజయం సాధిస్తే అది చరిత్రే కానుంది. ఎందుకంటే 1980 కి రెండేండ్లు ముందు.. అంటే 1978లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో అప్పటి ఆసీస్ టెన్నిస్ స్టార్ క్రిస్ ఓనెల్ టైటిల్ గెలిచింది. ఇక 2022 లో బార్టీ ఆ రికార్డును బద్దలుకొడుతుందా లేదా అంటే శనివారం తేలనుంది. జనవరి 29న ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల ఫైనల్ జరుగనుంది. ఈ టోర్నీ గెలిస్తే బార్టీకి తన కెరీర్ లో ఇది మూడో గ్రాండ్ స్లామ్ కానుంది. అంతకుముందు ఆమె ఫ్రెంచ్ ఓపెన్ (2019), వింబుల్డన్ (2021) గెలుచుకున్న విషయం తెలిసిందే.