Rafael Nadal: నాదల్ కు షాక్.. వింబూల్డన్ నుంచి అర్థాంతరంగా తప్పుకున్న స్పెయిన్ బుల్

Wimbledon 2022: స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. ఈ ఏడాది వరుసగా మూడో  గ్రాండ్ స్లామ్ నెగ్గే క్రమంలో మరో రెండు అడుగుల దూరంలోనే అతడు ఆగిపోవాల్సి వచ్చింది. వింబూల్డన్ నుంచి నాదల్ తప్పుకున్నాడు. 
 

Ahead Of Semi Finals, Rafael Nadal pulls out of Wimbledon Due To Injury

ఈ ఏడాది వరుసగా మూడో గ్రాండ్ స్లామ్ నెగ్గాలని ఉవ్విళ్లూరుతున్న రఫెల్ నాదల్ కు భారీ షాక్ తగిలింది. మూడో  ట్రోఫీ నెగ్గే క్రమంలో మరో రెండు అడుగుల దూరంలోనే అతడు ఆగిపోవాల్సి వచ్చింది. గాయం కారణంగా రఫెల్ నాదల్ వింబూల్డన్  నుంచి అర్థాంతరంగా వైదొలిగాడు.  క్వార్టర్స్ లో భాగంగా అమెరికాకు చెందిన టేలర్ ఫ్రిట్జ్ ను ఓడించిన  నాదల్.. పురుషుల సింగిల్స్ సెమీస్ లో  ఆస్ట్రేలియాకు చెందిన నికోలస్ హిల్మీ కిర్గియోస్ తో  తలపడాల్సి ఉంది.  

జులై 8న వింబూల్డన్ సెంటర్ కోర్టులో ఈమ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ నాదల్ కు గాయం తిరగబెట్టడంతో  అతడు మ్యాచ్ ఆడలేని స్థితిలో ఉన్నాడు. దాంతో  ఈ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్టు అతడు ప్రకటించినట్టు వింబూల్డన్ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. 

‘నేను ఈ టోర్నీ నుంచి నిష్క్రమిస్తున్నా. కడుపులో నొప్పి కారణంగా నేను  వింబూల్డన్ నుంచి తప్పుకుంటున్నాను. ఈ నొప్పితో నేను తదుపరి రెండు మ్యాచులు ఆడతానని అనుకోవడం లేదు. ఈ నొప్పితో నేను మ్యాచ్ ఆడితే నా కెరీర్ ను  మరో  నాలుగైదు నెలలు రిస్క్ లో పెట్టలేను. వింబూల్డన్ నుంచి తప్పుకుంటున్నందుకు నేను చాలా నిరాశకు లోనవుతున్నాను..’అని తెలిపాడు. 

 

నాదల్.. ఈ ఏడాది జనవరిలో ముగిసిన ఆస్ట్రేలియా ఓపెన్ నెగ్గాడు. ఆ తర్వాత ఇటీవలే   జరిగిన  ఫ్రెంచ్ ఓపెన్ లో కూడా తన మార్కు ఆటతో ఆ ట్రోఫీని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదే క్రమంలో వింబూల్డన్ కూడా నెగ్గాలనే పట్టుదలతో ఆడుతున్నాడు. కానీ సెమీస్ లో గాయం కారణంగా వైదొలగడంతో నాదల్ అభిమానులకు భారీ షాక్ తగిలింది. 

వింబూల్డన్ సెమీస్ నుంచి  నాదల్ తప్పుకోవడంతో కిర్గియోస్ ఆటోమేటిక్ గా ఫైనల్ చేరాడు.  కాగా 2003లో  మార్క్ ఫిలిప్పోసిస్ తర్వాత వింబూల్డన్ ఫైనల్ చేరిన ఆసీస్ ఆటగాడిగా కిర్గియోస్ చరిత్ర సృష్టించాడు. ఆదివారం అతడు ఫైనల్ లో.. జకోవిచ్ (సెర్బియా), నూరీ (ఇంగ్లాండ్) మధ్య జరుగబోయే రెండో సెమీస్ లో విజేతతో తలపడతాడు. 

క్వార్టర్స్ లో నాదల్‌కు పొత్తి కడుపులో నొప్పి రావడంతో మెడికల్‌ టైమ్‌ అవుట్‌ తీసుకొని మరీ ఆటను కొనసాగించాడు. 4 గంటల 21 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో నాదల్.. 3–6, 7–5, 3–6, 7–5, 7–6 (10/4) తో సూపర్‌ టైబ్రేక్‌ లో టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా)పై విజయం సాధించిన విషయం తెలిసిందే. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios