టెన్నిస్ కోర్టులోకి దూసుకొచ్చి.. ఇనుప వైర్లతో కట్టేసుకుని.. ఫ్రెంచ్ ఓపెన్ లో నిరసనకారిణి ఆందోళన
French Open 2022: సమస్యలపై నిరసన తెలపడానికి ఒక్కొక్కరికి ఒక్కో శైలి. వేదిక స్థాయి పెద్దదైతే వారి బాధ ఎక్కువ మందికి చేరుతుందనే ఆవేదన కొందరిది. ఓ పర్యావరణ కార్యకర్త ఇందుకు ఏకంగా ఫ్రెంచ్ ఓపెన్ నే ఎంచుకున్నది.
ఫ్రెంచ్ ఓపెన్ లో భాగంగా శుక్రవారం పురుషుల సెమీఫైనల్స్ జరుగుతున్నది. ఫిలిప్ చార్టియర్ కోర్ట్‌లో క్యాస్పర్ రూడ్ (క్రొయేషియా), మారిన్ సిలిక్ (నార్వే) ల మధ్య హోరాహోరి పోరు నడుస్తున్నది. గెలిచినోళ్లు ఫైనల్ చేరతారు. ఎవరు గెలుస్తారా..? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఓ యువతి హఠాత్తుగా టెన్నిస్ కోర్టులోకి దూసుకొచ్చింది. మ్యాచ్ ఆడుతున్న ఆటగాళ్లతో పాటు అక్కడ కూర్చుని మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకు అసలు ఆ అమ్మాయి ఏం చేస్తుందో కాసేపు అర్థం కాలేదు.
టెన్నిస్ కోర్టులోకి దూసుకొచ్చిన ఆ అమ్మాయి.. నెట్ దగ్గర కూర్చుని తనను తానే ఇనుప తాడుతో కట్టేసుకున్నది. సదరు యువతి.. ‘మనకింకా 1,028 రోజులు మాత్రమే మిగిలున్నాయి..’ అనే టీషర్ట్ వేసుకున్నది. ఇనుప గొలుసులతో ముడులు వేసుకున్న ఆమె ను పర్యావరణ కార్యకర్తగా గుర్తించారు.
ఇది గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆమె వద్దకు చేరుకుని ఏం హంగామా చేయకుండా ఆమె నెట్ కు కట్టిన ముడిని విప్పేసి అక్కడ్నుంచి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా 13 నిమిషాల పాటు మ్యాచ్ ను నిలిపేశారు. ఆ యువతిని 22 ఏండ్ల అల్జీగా గుర్తించారు డెర్నిర్ రెనోవేషన్ సంస్థకు చెందినదిగా భావిస్తున్నారు. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి (యూఎన్) చేసిన హెచ్చరికలపై ఆమె ఫ్రాన్స్ లో విస్తృత ప్రచారం చేస్తున్నది.
మ్యాచ్ ను వీక్షించేందుకని సక్రమంగా అందరితో పాటే టికెట్ తీసుకుని లోపలికి వచ్చిన ఆమె.. ఇలా చేయడం ద్వారా తన ఆవేదనను ప్రపంచానికి చాటా చెప్పిందని పర్యావరణ కార్యకర్తలు చెబుతున్నారు.
ఫైనల్ కు దూసుకెళ్లిన రుడ్
రెండో సెమీస్ లో క్యాస్పర్ రుడ్.. 3-6, 6-4, 6-2, 6-2 తేడాతో సిలిక్ పై గెలిచి ఫైనల్ కు చేరాడు. ఆదివారం జరిగే తుది పోరులో రుడ్.. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తో తలపడతాడు. శుక్రవారం ముగిసిన పురుషుల తొలి సెమీస్ లో భాగంగా నాదల్.. జ్వెరెవ్ (జర్మనీ) లు హోరాహోరిగా పోరాడారు. ఈ మ్యాచ్ లో నాదల్.. 7-6 (10/8) తేడాతో జ్వెరెవ్ పై గెలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ కు చేరడం నాదల్ కు ఇది 14వ సారి. ఇందులో అతడు 13 సార్లు విజేతగా నిలిచాడు.