ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు.  ముఖ్య సలహాదాారుగా సోమేష్ కుమార్, ప్రైవేట్ సెక్రటరీగా శరద్ మర్కడ్ ను కేసీఆర్ నియమించుకోవడం షర్మిల స్పందించారు.  

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య సలహాదారుడిగా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ను నియమించడంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. ఈ నిర్ణయం చెవిటోని ముందు శంఖం ఊదినట్లుగా వుందన్నారు. అసలు ఎవ్వరి సలహాలే తీసుకోనోడికి సలహాదారులు ఎందుకో? అంటూ వైఎస్ షర్మిల ఎద్దేవా చేసారు. 

సలహాదారులు సీఎంకు ఏం సలహాలిస్తారు... రుణమాఫీ అమలు చేయమని, లక్షా 91వేల ఉద్యోగాలు భర్తీ చేయమని, పేదలకు ఇండ్లు కట్టి ఇవ్వమని సలహా ఇచ్చేవాళ్ళేనా వీళ్లంతా? అంటూ షర్మిల ఎద్దేవా చేసారు. వీళ్లు రైతుబీమా అమలు చేయమని, పోడు భూములకు పట్టాలు ఇవ్వమని, నిరుద్యోగ భృతి ఇవ్వమని సలహా ఇచ్చేవాళ్లా? అని ప్రశ్నించారు. ఇలాంటి సలహాలు సలహాదారులు సీఎంకు ఎందుకివ్వడంలేదు... అయినా వీళ్ల సలహాలు వినేరకమా కేసీఆర్... అంటూ షర్మిల ఎద్దేవా చేసారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కేసీఆర్ నియంత నిర్ణయాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడని షర్మిల ఆరోపించారు. ఒంటెద్దు పోకడతో తెలంగాణను సర్వనాశనం చేసాడన్నారు. ప్రజల గోస వినే కమీషన్లకు ఆఫీసర్లు లేరు కానీ దోచిపెట్టే సలహాదారులను దొర పక్కన చేర్చుకున్నాడని అన్నారు.

Read More తెలంగాణ సీఎం ముఖ్య సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన సోమేశ్ కుమార్

ఇక ఇటీవల మహారాష్ట్రకు చెందిన యువకుడు శరద్ మర్కడ్ ను సీఎం కేసీఆర్ ప్రైవేట్ సెక్రటరీగా నియమించుకోవడంపైనా షర్మిల సీరియస్ అయ్యారు. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లేవు కానీ పక్కరాష్ట్రాల మందికి లక్షలు జీతమిచ్చి మేపుతున్నాడని మండిపడ్డారు. వాళ్లు తెలంగాణ ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ కేసీఆర్ కు, బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు.