హైదరాబాద్: తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పు తరహలోనే ఏపీ ప్రజలు కూడ తెలుగుదేశానికి బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అభిప్రాయపడ్డారు.

బుధవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు.తెలుగుదేశాన్ని  కాపాడుకోలేని చంద్రబాబునాయుడు  దేశాన్ని ఎలా కాపాడుతారో  చెప్పాలని  ఆమె ఎద్దేవా చేశారు.

గ్రేటర్‌హైద్రాబాద్‌ పరిధిలోని సెటిలర్ల ఓటర్లు ఎక్కువగా ఉన్న కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ తదితర నియోజకవర్గాల్లో  టీఆర్ఎస్‌ను గెలిపించి  తమ సంతోషాన్ని వ్యక్తం చేశారని రోజా చెప్పారు.

ఏపీలో  చంద్రబాబుపాలన పట్ల విసిగిపోయి టీడీపీ, కాంగ్రెస్  అభ్యర్థులకు వ్యతిరేకంగా ఒట్లు వేశారని చెప్పారు.ఏపీలో రైతులు, నిరుద్యోగులు, మహిళలు కూడ సంతోషంగా ఉన్నారని చెప్పారు.ఏపీలో కూడ తెలంగాణ తరహ తీర్పు ఇచ్చేందుకు ఏపీ ప్రజలు సిద్దంగా ఉన్నారని చెప్పారు.

వైఎస్ఆర్ లేని కాంగ్రెస్ తలలేని మొండెం లాంటిందని చెప్పారు. జగన్ ను నడివీధిలోకి తీసుకొచ్చిన కాంగ్రెస్ కు  ప్రజలు బుద్ది చెప్పారని ఆమె గుర్తు చేశారు.
తప్పు చేసిన వారికి  ప్రజలు  శిక్ష విధిస్తారని రేవంత్ రెడ్డి ఓటమి గుణపాఠమని ఆమె అభిప్రాయపడ్డారు.

త్వరలో జరిగే ఎన్నికల్లో తెలంగాణ ప్రజల తరహలోనే  ఏపీ ప్రజలు ఆలోచనతో ఓటు చేయాలని ఆమె కోరారు.చంద్రబాబును  ప్రజలు నమ్మే స్థితి లేదన్నారు. లగడపాటి  రాజగోపాల్ సర్వే సన్యాసం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.