తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సిపి ఎందుకు ఫోటీ చేయడంలేదో ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వెల్లడించారు. ప్రస్తుతం తమ దృష్టంతా ఏపీపైనూ కేంద్రీకరించామని...భవిష్యత్ లో తెలంగాణ పై దృష్టి పెడతామని వివరించారు. చంద్రబాబు పాలనలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నలిగిపోతున్నారని, ఆ పాలన అంతం చేయడమే తమ ముంందున్న ప్రథమ కర్తవ్యమన్నారు. అందువల్లే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనడం లేదని అంబటి వివరించారు. 

తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పనిచేస్తున్నామని చెప్పే చంద్రబాబు డిల్లీ  కాంగ్రెస్ ముందు మోకరిల్లి ఆ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడని అంబటి మండిపడ్డారు. తెలంగాణలో ముష్టి 13 సీట్ల కోసం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేశారని విరుచుకుపడ్డారు. గతంలో కాంగ్రెస్ పార్టీని తిట్టి ఇప్పుడు అదే పార్టీతో కలిసి అధికారంకోసం ప్రాకులాడటానికి చంద్రబాబుకు మనసెలా ఒప్పిందంటూ...ఈ నిర్ణయం తీసుకోడానికి ఆయనకు సిగ్గుండాలంటూ అంబటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణలో ఎందుకు పోటీ చేయడం లేదని చంద్రబాబు నాయుడు, రఘువీరా రెడ్డిలు ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణలో పోటీ చేయడం లేదని గతంలోనే వైఎస్సార్‌సిపి ప్రకటించిందని అంబటి గుర్తు చేశారు. అయినా తమ పార్టీ నేతలను ప్రశ్నించే హక్కు టిడిపి, కాంగ్రెస్‌ నాయకులకు లేవని అంబటి హెచ్చరించారు.