టీఆర్ఎస్ కూడా రాజకీయ పార్టీయే అని.. ఏ పథకం ప్రవేశపెట్టినా ప్రయోజనం ఆశిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో ఎన్నికలు ఉంటేనే పథకాలు వస్తాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి విరుచుకుపడ్డారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. టీఆర్ఎస్ ఇప్పుడు ఉద్యమ పార్టీ కాదని, పూర్తిగా రాజకీయ పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆమె స్పందించారు. టీఆర్ఎస్ ఫక్తు రాజకీయ పార్టీ అని కేసీఆర్ అంగీకరించారని షర్మిల అన్నారు. ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఏదో ఒక పథకాన్ని తీసుకొస్తాం తప్ప... ప్రజల అభివృద్ధి మాత్రం మాకు పట్టలేదు అని చెప్పినందుకు చాలా సంతోషమంటూ ఆమె సెటైర్లు వేశారు. జనాలను మోసం చేస్తూ గెలుస్తున్నామని ఇప్పటికైనా చెప్పినందుకు సంతోషమని ఎద్దేవా చేశారు.
Also Read:ఏ స్కీం పెట్టినా.. రాజకీయ ప్రయోజనం ఆశిస్తాం, టీఆర్ఎస్ కూడా పార్టీయే: దళిత బంధుపై కేసీఆర్ వ్యాఖ్యలు
టీఆర్ఎస్ పాలనలో ఎన్నికలు ఉంటేనే పథకాలు వస్తాయని, ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని... ఈ విషయాన్ని ప్రజలు ఇప్పటికైనా గమనించాలని షర్మిల సూచించారు. కాబట్టి మీ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మీ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలంటూ ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. ఉపఎన్నికలు వస్తే కేసీఆర్ దృష్టి మీ ప్రాంతంపై పడుతుందని... ఎన్నికల్లో గెలిచేందుకు కొత్త పథకాలను తీసుకొస్తారని, ఎన్నికల్లో గెలిచాక హామీలను మళ్లీ మూలకు పడేస్తారని షర్మిల మండిపడ్డారు
