ఖమ్మం టూర్: పంటపొలంలోనే సొమ్మసిల్లిపడిపోయిన వైఎస్ షర్మిల
ఖమ్మం జిల్లా టూర్ లో వైఎస్ షర్మిల అస్వస్థతకు గురయ్యారు. పంట పొలాలను పరిశీలిస్తున్న సమయంలో ఆమె సొమ్మసిల్లిపడిపోయారు.
ఖమ్మం: ఖమ్మం జిల్లా పర్యటనలో ఆదివారంనాడు వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల సొమ్మసిల్లిపడిపోయారు.. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పలు జిల్లాల్లో పంట నష్టపోయింది. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైఎస్ షర్మిల పంట నష్టపోయిన రైతులను పరామర్శించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇవాళ ఉదయం జిల్లాలో పంట దెబ్బతిన్న రైతుల పొలాల్లో ఆమె పర్యటించారు. రైతులతో మాట్లాడారు. పంట నష్టం గురించి ఆరా తీశారు. ఈ సమయంలోనే ఆమె అస్వస్థతకు గురయ్యారు. పంట పొలంలోనే వైఎష్ షర్మిల కళ్లు తిరిగి పడిపోయారు.
వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు షర్మిలకు మంచినీళ్లు అందించారు. మంచినీళ్లు తాగిన కొద్దిసేపటికి ఆమె కోలుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గత నెల 23 న ఇదే బోనకల్ మండలానికి కెసిఆర్ వచ్చాడని ఆమె గుర్తు చేశారు. మొక్క జొన్న పంటను పరిశీలించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. పంట నష్టపోయిన ఎకరానికి రూ. 10 వేల పరిహారం అందిస్తామని కేసీఆర్ ప్రకటించాడని ఆమె గుర్తు చేశారు. ఈ మండలంలో పంట నష్టపోయిన రైతులకు ఇంకా నిధులు విడుదల కాలేదని వైఎస్ షర్మిల విమర్శించారు. ఇంటికి వెళ్లేలోపు నిధులు విడుదల చేస్తామన్నారన్నారు బహుశా కెసిఆర్ ఇంకా ఇంటికి పోలేదేమో అని ఆమె సెటైర్లు వేశారు.
గత నెల రోజుల్లో పడిన వర్షాలకు ఖమ్మం జిల్లాలో దాదాపు 50 వేల ఎకరాల్లో వరకు పంట నష్టం జరిగిందన్నారు. మధిర నియోజక వర్గంలో 16 వేల మంది రైతులు నష్టపోయారని ఆమె చెప్పారు.
తెలంగాణలో పంట నష్టం జరిగితే పరిహారం ఇచ్చే దిక్కు లేదన్నారు. అసలు పంటలకు భీమా లేదిని షర్మిల తెలిపారు. .గత 9 ఏళ్లుగా 14 వేల కోట్ల వరకు పంట నష్టం జరిగిందని షర్మిల ప్రస్తావించారు. అయినా కూడా కేసీఆర్ సర్కార్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఖజానా ను కేసీఅర్ దుబారా చేస్తున్నాడని ఆమె విమర్శించారు. సెక్రటేరియట్ కి 15 వందల కోట్లు ఖర్చు చేశారన్నారు. మ్యానిఫెస్టోలో పెట్టని అంశాల మీద వేల కోట్లు తగలేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇచ్చిన వాగ్ధానాలు ఒక్కటి నెరవేర్చలేదని ఆమె ఆరోపించారుు. ఓట్లు వేసిన ప్రజలను మోసం చేశారన్నారు.
మ్యానిఫెస్టోలో లేని కాళేశ్వరం ప్రాజెక్ట్ కి 1.20లక్షల కోట్లు ఖర్చు చేశారన్నారు. మిషన్ భగీరథ పేరు చెప్పి వేల కోట్లు తగలేశారని ఆమె ఆరోపించారు.
కేసీఅర్ ఎప్పుడు సెక్రటేరియట్ కి పోయిన మొహం కాదన్నారు. సెక్రటేరియట్ కి పోనీ ముఖ్యమంత్రికి అన్ని వందల కోట్ల తో భవంతులు ఎందుకని ఆమె ప్రశ్నించారు.రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేశాడన్నారు.
గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో అకావ వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంట దెబ్బతిన్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో పంట నష్టంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రాథమిక అంచనా మేరకు సుమారు 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టమైందని అధికారులు తేల్చారు.