వాళ్లిద్దరూ మంచి స్నేహితులు. వయసురీత్యా ఇద్దరి మధ్యా కొద్దిగా తేడాగా ఉన్నా.. స్నేహానికి అదేమీ అడ్డురాలేదు. సరదాగా ఉండే వారి స్నేహం లాక్ డౌన్ వేళ బాధ్యతగా మారింది.  చెయ్యి చెయ్యి కలిసి.. లాక్ డౌన్ వేళ... తిండి దొరకక ఇబ్బంది పడుతున్న వారికి ఆహారం అందించడం మొదలుపెట్టారు. ఆ మంచి ప్రయత్నం లో ఇద్దరి మధ్యా డబ్బుల విషయంలో చిన్న తేడా వచ్చింది.  ఆ చిన్న తేడా ఇద్దరిలో ఒకరి ప్రాణం తీసింది. ఈ సంఘటన కాగజ్ నగర్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కాగజ్ నగర్ పట్టణానికి చెందిన పదో తరగతి విద్యార్థి(16) అదే కాలనీకి చెందిన యువకుడు ప్రవీణ్(25) స్నేహితులు. లాక్ డౌన్ నేపథ్యంలో వీరిద్దరూ మరికొందరు యువకులతో కలిసి పేదలకు భోజనం పెట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే కాలనీలో డబ్బులు పోగు చేసి వాటితో ఆహారం చేయించి.. ప్రతి రోజూ 120 మంది పేదలకు పంపిణీ చేసేవారు.

ఓ కిరాణా వ్యాపారి సహాయం కూడా వీరు తీసుకున్నారు. అయితే.. ఈ భోజనాల కోసం పోగు చేసిన డబ్బుల విషయంలో ఆ ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే ఆ పదో తరగతి విద్యార్థి ప్రవీణ్ పై చెయ్యి చేసుకున్నాడు.

అది అవమానకరంగా భావించిన ప్రవీణ్ కోపంలో ఇంటికి వెళ్లి కత్తి తో బయలు దేరాడు. అదే సమయంలో ఆ విద్యార్థి ఇంటికి వెళుతూ ప్రవీణ్ కి కనిపించాడు. మరోసారి ఇద్దరి మధ్యా గొడవ చోటుచేసుకుంది.

ఇక ఆవేశం ఆపుకోలేకపోయిన ప్రవీణ్.. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆ విద్యార్థిపై దాడి చేశాడు. కాగా.. తీవ్రగాయమై ఆ విద్యార్థి ప్రాణాలు వదిలాడు. కాగా.. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.