ప్రేమికులు రోజు నాడు ఓ యువకుడు ఓ యువతిని దారుణంగా హత్య చేశాడు. ఏకాంతంగా గడుపుదామని ఒంటరిగా యువతిని పిలిచిన అతడు చివరికి దారుణానికి ఒడిగట్టాడు.
వారిద్దరు ప్రేమించుకున్నారు. ప్రేమికుల రోజు నాడు ఏకాంతంగా గడుపుదామని ప్రేయసితో ప్రియుడు చెప్పాడు. ఆ మాటలు ఆ యువతి (17) నమ్మింది. ఇంట్లో నుంచి అతడు చెప్పిన చోటుకు వెళ్లింది. కానీ అక్కడికి వెళ్లిన తరువాత ఏం జరిగిందో ఏమో కానీ ఆ ప్రియుడే ఆమె పట్ల కాలయముడుగా మారాడు. ప్రేమికుడి మాటలు నమ్మి ఒంటరిగా వెళ్లిన యువతి శవంగా మారింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ లో ఆదివారం రాత్రి జరిగింది. ఇది స్థానికంగా సంచలనం సృష్టించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు ఆదివారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. సాయంత్రం సమయంలో మృతురాలి తల్లి ఇంట్లో లేదు. రాత్రి సమయంలో ఇంట్లోకి తల్లి వచ్చినా అనుమానం రాకుండా ఉండేందుకు బెడ్ పై తలదింట్లు పెట్టి, దానిపైన దుప్పటి వేసింది. బయట నుంచి చూసే వారికి నిద్రపోతున్నట్టుగా కనిపించేలా ఏర్పాట్లు చేసింది. అయితే తల్లి వచ్చి చూసి అనుమానం కలగడంతో దుప్పటి తీసి చూస్తే కూతురు కనిపించలేదు. దీంతో ఆ సమయంలో మరో వ్యక్తి సాయం తీసుకొని కూతురును వెతికింది.
ఊర్లోని చుట్టాలు, తెలిసి వారి ఇళ్లలోకి వెళ్లి కూతురు జాడ కోసం వెతికింది. కానీ కనిపించలేదు. అయితే సోమవారం హుగ్గేలి సమీపంలోని మామిడితో తోటలో ఓ యువతి మృతదేహం ఉన్నట్టు స్థానిక సర్పంచ్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. మృతురాలు జహీరాబాద్ సిటీలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతోందని గుర్తించామని సీఐ రాజశేఖర్ తెలిపారు. ఘటనా స్థలం లభించిన ఆధారాలని బట్టి చూస్తే వారు మొదటగా అల్పాహారం తిన్నట్టు తెలుస్తోందని అన్నారు. అయితే వాలెంటైన్స్ డే కావడంతో ఏకాంతంగా గడుదామని ప్రియుడు పిలిచి ఉంటాడని, ఆ సమయంలో యువతిపై లైంగిక దాడి చేసి ఉండొచ్చని, దీనిని కుటుంబ సభ్యులకు చెబుతుందనే భయంతో చున్నీతో ఆమె ఊపిరి ఆగేలా చేసి చంపేసి ఉంటాడని అనుమానిస్తున్నామని సీఐ తెలిపారు. దర్యాప్తు నిర్వహించి ఈ ఘటనకు కారణాలు ఏంటనే విషయాలు వెల్లడిస్తామని తెలిపారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని సీఐ చెప్పారు.
