మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామంలో ముస్కె మహేష్ అనే యువకుడిని గొంతుకోసి, బండతో తలమీద కొట్టి హత్య చేశారు.
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామంలో ముస్కె మహేష్ అనే యువకుడిని గొంతుకోసి, బండతో తలమీద కొట్టి హత్య చేశారు దుండగులు. ఈ హత్యకు ప్రేమవ్యవహారం, వేధింపులే కారణమని తెలుస్తోంది. ఈ హత్యను లైవ్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బైక్ మీద వెడుతున్న యువకుడికి బండరాయితో కొట్టి.. ఆ తరువాత గొంతుకోసి హత్య చేశారు. ఈ దాడిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది.
కాగా, మృతుడు మహేష్ కుటుంబ సభ్యులు పోలీసులను నిలదీస్తున్న మరో వీడియో కూడా వెలుగు చూసింది. తమ కొడుకు చావుకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని.. వారే తమ కొడుకును పొట్టనపెట్టుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఇప్పటికి తెలిసిన వివరాల ప్రకారం....
మంచిర్యాలజిల్లా, జైపూర్ మండలం ఇందారం గ్రామంలో మహేష్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమ పేరుతో వేధించేవాడు. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల పెద్దలు అతడిని మందలించి.. ఆ తరువాత యువతికి మరో యువకుడితో వివాహం జరిపించారు. ఈ క్రమంలో ఇటీవల యువతి గ్రామానికి వచ్చి, తల్లిగారింట్లో ఉంటోంది.
హైద్రాబాద్ బోరబండలో దారుణం: ప్రేమను నిరాకరించిందని యువతి గొంతుకోసిన ప్రేమోన్మాది
కొద్ది రోజులు బాగానే ఉన్న మహేష్.. మళ్లీ వివాహితకు అసభ్య మెసేజ్లు పెట్టి వేధిస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోకపోవడంతో యువతి కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు.. మహేష్ బండి మీద వస్తుండగా దారిలో అటకాయించారు. పెట్రోల్ పంపులో పెట్రోల్ పోసుకుని వస్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డుమీద అందరూ చూస్తుండగానే ఈ దాడికి పాల్పడ్డారు.
మహేష్ ను హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు హత్యను లైవ్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి అంతకు ముందు మహేష్, సదరు యువతి ప్రేమించుకున్నారు. ఆ సమయంలో షేర్ చేసిన ఫొటోలను అసభ్యంగా చేసి ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడని తెలుస్తోంది.
కాగా, విషయం తెలియగానే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..పరిస్థితిని అదుపులోకి తీసుకువస్తున్నారు. పోలీసులతో మృతుడి కుటుంబసభ్యులు వాదనకు దిగారు. వారివల్లే కొడుకు చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరూ చూస్తుండగానే కొడుకును చంపినా ఎవ్వరూ ఆపలేదని బాధ వ్యక్తం చేశారు. అయితే, వీరి కుటుంబాలను కొంతకాలంగా వైరం ఉందని పోలీసులు చెబుతున్నారు.
