మంచిర్యాల: అతడు ఉన్నత చదువులు చదువుతున్నాడు. అయితే అప్పుడప్పుడు సరదాగా ఆడుతున్న ఆన్ లైన్ జూదం చివరకు అలవాటుగా మారింది. దీంతో అప్పులు చేసి మరీ జూదం ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలో అప్పులవారి ఒత్తిడి ఎక్కువ అవడంతో తట్టుకోలేక చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... మంచిర్యాల పట్టణానికి చెందిన అభిలాష్(25) సీఏ చదువుతున్నాడు. చదువు ఒత్తిడిని తగ్గించుకునేందుకు అప్పుడప్పుడు ఆన్ లైన్ రమ్మీ ఆడేవాడు. అయితే రానురాను ఇది అతడికి అలవాటుగా మారింది. చదువును పక్కనపెట్టి రమ్మీ ఆడటమే పనిగా పెట్టుకున్నాడు. ఇలా జూదం ఆడేందుకు బయట అప్పులు చేశాడు. 

అయితే జూదంలో డబ్బులు మొత్తం కోల్పోవడం... అప్పులు కట్టలేని పరిస్థితి వుండటంతో అభిలాష్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో దారుణ నిర్ణయం తీసుకున్నాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.