విద్యుత్ మీటర్ రీడింగ్‌ను వినియోగదారులే సెల్‌ఫోన్ ద్వారా తీసుకొనే యాప్‌ను టీఎస్‌ఎస్పీడీసీఎల్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 

హైదరాబాద్: విద్యుత్ మీటర్ రీడింగ్‌ను వినియోగదారులే సెల్‌ఫోన్ ద్వారా తీసుకొనే యాప్‌ను టీఎస్‌ఎస్పీడీసీఎల్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలో కరోనా సమయంలో విద్యుత్ రీడింగ్ తీసేందుకు సిబ్బంది రాకున్నా వినియోగదారులే విద్యుత్ రీడింగ్ ను తీసుకొనే యాప్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఈ యాప్ సేవలను బుధవారం నాడు ప్రారంభించింది.

గూగుల్ ప్లే స్టోర్ నుండి టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ ఐటీ సెల్ (TSSPDCL IT ) యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసుకోగానే యునిక్ సర్వీస్ సెంబర్ , ఈ మెయిల్ , మొబైల్ నెంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి. మీటర్ నెంబర్ నమోదు చేయగానే మీటర్ స్కానింగ్ అనే ఆప్షన్ చూపిస్తోంది. దీంతో దానిపై క్లిక్ చేసి మీటర్ లో 'కేడబ్ల్యూ‌హెచ్' అంకెలు వచ్చినప్పుడు స్కాన్ చేయాలి. వినియోగదారుడు నమోదు చేసిన వివరాలన్నీ సక్రమంగా ఉంటేనే నెక్ట్స్ అని చూపిస్తోంది. దానిని నొక్కగానే ఆన్‌లైన్ లో బిల్లు కన్పిస్తోంది. 

ఇదే యాప్ ద్వారా విద్యుత్ బిల్లును కూడ చెల్లించే వెసులుబాటు ఉంటుంది. మీటర్ రీడింగ్ ఎలా తీయాలో ఓ వీడియోను కూడ వినియోగదారులకు అర్ధమయ్యేలా ఉంది. మరో వైపు వినియోగదారుడు మీటర్ రీడింగ్ తీయడానికి ముందే విద్యుత్ సిబ్బంది మీటర్ రీడింగ్ తీస్తే ఆ విషయం యాప్ చెబుతోంది. విద్యుత్ సిబ్బంది కంటే ముందే వినియోగదారుడు రీడింగ్ తీస్తే ఆ విషయాన్ని విద్యుత్ శాఖకు చేరవేయనుంది.