రైల్వే అధికారులు చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా... చాలా మంది ప్రయాణికుల ప్రాణాల మీదకు తీసుకువచ్చింది. ఈ సంఘటన  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... సోమవారం సాయంత్రం 3.50 గంటల సమయంలో ప్లాట్‌ఫాం నెంబరు ఒకటిపై హౌరా (ఫలక్‌నుమా) ఎక్స్‌ప్రెస్‌ రైలు రావాల్సి ఉంది. అయితే, అదే సమయంలో ఫలక్‌నుమా ఎంఎంటీఎస్‌ రైలు నాలుగో నెంబరు ప్లాట్‌ఫాంపైకి వచ్చినట్లు అనౌన్స్‌మెంట్‌ అయింది. 

దీంతో హౌరా ఫలక్‌నుమా రైలులో వెళ్లాల్సిన ప్రయాణికులు రైలు వచ్చేసిందన్న టెన్షన్‌లో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిపైకి వెళ్లకుండా ఉరుకులు, పరుగులతో నేరుగా పట్టాలు దాటుకుంటూ వెళ్లారు. అదే సమయంలో కాగజ్‌నగర్‌ వైపు వెళ్లే భాగ్యనగర్‌ రైలు కదల డంతో, పట్టాలు దాటుతున్న ప్రయాణికుల ప్రాణాల మీదికి తెచ్చుకున్నట్లు అయ్యింది. 

చివరికి వచ్చింది ఎంఎంటీ ఎస్‌ అని తెలుసుకున్న ప్రయాణికులు మళ్లీ ఒకటో నంబర్‌ ఫ్లాట్‌పాంపైకి వచ్చారు. భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇంజన్‌ ముందు నుంచే కొందరు వెళ్లడం.. అదే సమయంలో కొందరు పట్టాలు దాటుతుండడంతో కొంత టెన్షన్‌ నెలకొంది.