ప్రేమ పేరిట వెంటపడి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీరా అవసరం తీరాక.. ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది.  తనకు న్యాయం చేసే వరకు అక్కడి నుంచి కదలనని భీష్మించుకు కూర్చుంది.  ఈ సంఘటన హైదరాబాద్ లోని మారేపల్లిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మారేడుపల్లి, శేషాచల కాలనీకి ెందిన జార్జి అలియాస్ జెర్రీ... ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బోయినపల్లిలో ఉంటున్న ప్రకాశం జిల్లాకు చెందిన వాణికి 2015లో లయోలా కాలేజీలో బీకాం చదువుతున్న సమయంలో తన స్నేహితురాలి ద్వారా జార్జితో పరిచయం ఏర్పడింది. ఉద్యోగం ఇప్పిస్తానని, ప్రేమించానని, పెళ్లి చేసుకుంటాడని నమ్మించి మోసం చేసినట్లు తెలిపింది.

పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా నిరాకరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. జార్జి త్వరలో మరో యువతిని వివాహం చేసుకుంటున్నట్లు సమాచారం అందడంతో శేషాచలకాలనీలోని అతడి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది. బాధితురాలికి మహిళా సంఘాలు సంఘీభావం తెలిపాయి. 

బాధితురాలితో సంప్రదింపులు జరిపిన జార్జి కుటుంబ సభ్యులు మూడురోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వాణి తెలిపింది. ఇదిలా ఉండగా జార్జి మాత్రం వాణిని ప్రేమించలేదని, ఆమెతో ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. వాణికి చెడు అలవాట్లు ఉన్నందున ఆమెకు దూరంగా ఉంటున్నట్లు పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.