హైదరాబాద్ పాతబస్తీలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. 3 ఏళ్ల బాలుడిని సొంత మేనత్త భవనం పై నుంచి కిందకు విసిరేసి హత్య చేసింది. వివరాల్లోకి వెళితే..  పాతబస్తీ పరిధిలోని భవాని నగర్‌కు చెందిన ఆయేషాకు రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది.

ఈ నేపథ్యంలో మంగళవారం తన మేనల్లుడిని ఇంటికి తీసుకువచ్చింది. అయితే ఆ కాసేపటికే చిన్నారిని భవనంపైకి తీసుకెళ్లిన ఆమె అక్కడి నుంచి కిందకు విసిరేయడంతో బాలుడు తీవ్ర గాయాలతో మృతి చెందాడు.

రంగంలోకి దిగిన పోలీసులు ఆయేషాను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

అయితే వివాహం జరిగి రెండు సంవత్సరాలు గడుస్తున్నా సంతానం లేకపోవడంతో మానసిక ఒత్తిడికి లోనైన ఆయేషా ఈ దారుణానికి ఒడిగట్టిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.