Governor Tamilisai: నేటీకి సమాజంలో మహిళలు వివక్షకు గురవుతూనే ఉన్నారనీ, అత్యున్నత పదవిలో ఉన్న మహిళలకు కూడా సరైన గౌరవం దక్కడం లేదని, భారతీయ మహిళ ఎవరికీ భయపడదు. ప్రతి మహిళా ఆర్థిక స్వావలంబన కలిగి ఉండాలని తెలంగాణ గవర్నర తమిళిసై సౌందర రాజన్ అన్నారు.
Tamilisai Soundararajan: సమాజంలో మహిళలకు ఇప్పటికీ సరైన గౌరవం దక్కడం లేదని, వివక్షకు గురవుతూనే ఉన్నారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అత్యున్నత పదవిలో ఉన్న మహిళలూ అందుకు మినహాయింపు కాదని, వారికి కూడా సరైన గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు నేటీకి.. తన సమాన హక్కుల కోసం.. ఇలాంటి వివక్ష పూరిత పరిస్థితులు ఎదుర్కోవడం బాధాకరమన్నారు. భారతీయ మహిళ ఎవరికీ భయపడదని, తననెవరూ భయపెట్టలేరని.. తాను దేనికి భయపడనని స్పష్టం చేశారు. సోమవారం రాజ్భవన్లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో.. మహిళా సాధికారతను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడారు.
స్త్రీలందరూ ఆర్థిక స్వావలంబన కలిగి ఉండాలని, భవిష్యత్తు కోసం పొదుపు పాటించాలని చెప్పారు. ఏ స్త్రీకి కూడా నా అనే స్వార్థం ఉండదనీ, తన , మన అనే భావిస్తుందని, ఆమె ప్రతిదీ తన కుటుంబం కోసమే కోరుకుంటుందని గవర్నర్ తెలిపారు. . ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని... దేని కోసం కూడా ఆనందాన్ని వదులుకోకూడదు. నిరాశ, నిస్పృహలో కూరుకుపోకుండా..ప్రతి అడుగూ నూతనోత్సహంతో ముందుకు సాగాలని చెప్పాలి. ఏదైనా సాధించాలనే తపనతో సవాళ్లతో కూడిన పనులు చేపట్టి రాణించాలని చెప్పారు.
ఈ సందర్భంగా తమిళనాడు మహిళలకు, తెలంగాణ స్త్రీలకు తేడా ఏంటని.. ఇటీవల తనను ఓ ఇంటర్వ్యూలో అడిగారని తమిళిసై అన్నారు. అందరూ ఒకేలా ఉంటారని సమాధానం చెప్పినట్లు తెలిపారు. ఇక్కడ తెలంగాణ ఆడపడుచులా ఉంటున్నాని, మహిళల జీవన విధానాన్ని ఎంతగానో ఇష్టపడతానని అన్నారు. ప్రతి నిమిషాన్ని ఆస్వాదించాలని.. దేని కోసం తమ ఆనందాన్ని వదులుకోకూడదని సూచించారు. అవకాశాలను చేజార విడవకుడదనీ, తరువాత బాధపడాల్సిన అవసరం లేదని.. ఏదైనా సాధించాలనే తపన ఎప్పుడూ ఉండాలని గవర్నర్ స్పష్టం చేశారు.
స్త్రీలను గుర్తించి, గౌరవించి, వారి కృషిని తోడ్పాటు అందించాలని ప్రతిరోజూ మహిళా దినోత్సవం కావాలని గవర్నర్ తమిళసై అన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.శ్రీ సుధ, జస్టిస్ రాధారాణి, జస్టిస్ మాధవీదేవి, ఎమ్మెల్యే సీతక్క, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఉపమేయర్ శ్రీలతారెడ్డి, పలువురు మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులను, వివిధ రంగాల్లో రాణిస్తున్న వారిని గవర్నర్ సత్కరించారు.
