భర్త తనకు విడాకుల నోటీసులు పంపడాన్ని జీర్ణించుకోలేక ఓ భార్య బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నిజాంపేటకు చెందిన మేఘనకు హైదర్‌నగర్‌కు చెందిన వినయ్ కుమార్‌కు 2017లో పెళ్లయ్యింది.

కొన్నాళ్లు బాగానే గడిచినప్పటికీ ఆ తర్వాత వినయ్ అతని బంధువులు మేఘనను శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. కొంతకాలం ఓపిక పట్టిన ఆమె తర్వాత సహనం నశించడంతో పుట్టింటికి వెళ్లిపోయింది.

ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం మేఘనకు ఆమె భర్త వినయ్ కుమార్ విడాకుల నోటీసు పంపించాడు. దీనిపై దిగ్బ్రాంతికి గురైన ఆమె భర్తతో మాట్లాడేందుకు హైదర్‌నగర్‌లోని నైన్ స్టోరీ అపార్ట్‌మెంట్ వద్దకు వచ్చింది.

అయితే ఆ సమయంలో వినయ్ కుమార్ అక్కడ లేకపోవడంతో చాలా సేపు ఎదురు చూసింది. చివరికి సాయంత్రం 3.30 గంటలకు బాధను జీర్ణించుకోలేక టెర్రస్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మేఘన తండ్రి ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపులతో పాటు ఆత్మహత్యకు ప్రేరేపించారన్న అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.