తనను ప్రేమించి మోసం చేసిన ప్రియుడి  ఇంటి ఎదుటు ఓ యువతి నిరసనకు దిగింది. ప్రేమ పేరుతో తన వెంట తిరిగి ఇప్పుడు వేరే యువతిని పెళ్ళి చేసుకున్నాడని ఆరోపిస్తూ సదరు యువతి ప్రియుడి ఇంటిముందు బైటాయించి నిరసన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని బాధిత యువతి బీష్మించుకు కూర్చుంది.ఈ ఘటన హైదరాబాద్ లోని మారేడుపల్లిలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే...వరంగల్ జిల్లా జనగాం ప్రాంతానికి చెందిన ప్రశాంత్, అనూషకు ఓ ప్రయివేట్ కంపనీలో పనిచేసే సమయంలో పరిచయం ఏర్పడింది.  ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో వీరి మధ్య చనువు పెరిగి ప్రేమకు దారితీసింది. అయితే ప్రశాంత్‌తో అనూష పెళ్లి ప్రతిపాదన తీసువచ్చేసరికి అతడి నిజస్వరూపం బయటపడింది. దీంతో 2017 లో ఓ పోలీస్ స్టేషన్లో అనూష ఫిర్యాదు చేసింది. అప్పటికి ఆమె మైనర్ కావడంతో పోలీసులు ఆమె ఫిర్యాదుపై చర్యలు తీసుకోకుండా కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

 ఈ వ్యవహారం తర్వాత ప్రశాంత్ గుట్టుగా తమ సొంతూల్లో పెళ్లి చేసుకున్నాడు. భార్య, తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ లోని మారేడు పల్లి ప్రాంతంలో నివాసముంటున్నాడు. అయితే తాజాగా ప్రశాంత్ కు పెళ్లయినట్లు తెలుసుకున్న అనూష ప్రియుడి ఇంటి ముందు నిరసనకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడినుండి కదలనని అనూష తెలిపింది. 

దీంతో స్థానిక పోలీసులు అనూషను నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. తమకు ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పినా బాధిత యువతి వినిపించుకోవడంలేదని పోలీసులు తెలిపారు.