ఖమ్మం: ఏం కష్టం వచ్చిందో ఏమో తెలీదుగానీ నవమాసాలు మోసి కనీ పెంచిన పిల్లలతో కలిసి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి ఓ మహిళ మున్నేరు నదిలో దూకడాన్ని గమనించిన మత్స్యకారులు వారిని కాపాడేప్రయత్నం చేశారు. అయితే వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. నది ప్రవాహంలో కొట్టుకుపోయి తల్లీ బిడ్డలు చనిపోయారు. 

మృతులు ఖమ్మం నగరానికి చెందిన వనిత, చైతన్య, రోహితలుగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే వనిత చిన్నారులతో కలిసి ఆత్మహత్య చేసుకుని వుంటుందని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో గాలింపు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం ఈ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఈ ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.