అక్రమ సంబంధానికి అడ్డుగా వున్నాడని కట్టుకున్న భర్తను హతమార్చిన ఓ మహిళకు కోర్టు కఠిన శిక్ష విధించింది. ఈ ఘటన 2016 అక్టోబర్ లో చోటుచేసుకోగా అప్పుడే మహిళతో పాటు ఆమె ప్రియున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుండి కోర్టులో ఈ కేసుపై వాదనలు కొనసాగగా తాజాగా తుది తీర్పు వెలువడింది. ఈ హత్యను మృతుడి భార్యే కారణమని తేల్చిన కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 

ఈ హత్యకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా  మసాన్ పల్లి గ్రామానికి చెందిన బొంత రాజు(33), గంగ(28) భార్యాభర్తలు. వీరికి శ్రీను అనే ఏడేళ్ల కొడుకున్నాడు. గ్రామంలో  ఉపాధి అవకాశాలు లేక  రాజు కుటుంబంతో కలిసి హైదరాబాద్ కు వలస వచ్చి కుషాయిగూడ ప్రాంతంలో నివాసముంటున్నాడు.  భార్యాభర్తలిద్దరు అడ్డా కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగించేవారు. 

అయితే ఇలా కూలీకి వెళ్లిన సమయంలో గంగకు కురువ శ్రీనివాస్ తో అక్రమ సంబంధాన్ని ఏర్పర్చుకుంది. తన  అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న భర్త అడ్డు తొలగించుకోవాలసి భావించిన ఆమె అతి దారుణంగా రాజును హతమార్చింది. ఈ హత్యలో ప్రియుడు శ్రీనివాస్ ప్రమేయం కూడా వుందని పోలీసులు అనుమానించి మహిళతో పాటు అతన్ని కూడా అరెస్ట్ చేశాడు. 

కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. వారిని రిమాండ్ కు తరలించాలని ఆదేశించిన కోర్టు ఈ కేసులో ఇవాళ తుది తీర్పు వెలువరించింది. నిందితురాలు గంగకు  యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించింది. అయితే ఆమె ప్రియుడికి ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని  తేల్చిన  కోర్టు శ్రీనివాస్ ను నిర్దోశిగా విడుదలచేసింది.